రెండు ఇళ్లలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు
సొత్తు స్వాధీనం
ఆరిలోవ : ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల కిందట చోరీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతోపాటు అతడి వద్ద నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం విభాగం డీసీపీ లతా మాధురి తెలిపారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆమె విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 14న పాతడెయిరీఫారం సమీపం జాతీయరహదారిని ఆనుకొని రాజీవ్‌నగర్‌లోని వసంత విహార్‌లో ఈరాకి సత్యనారాయణ ప్లాట్‌లో దొంగలు పడి సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, దానికి సమీపంలో సాయి రెసిడెన్సీలో చుక్కా వంశీకృష్ణ ఇంట్లో 28 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, రూ.లక్ష నగదు, ల్యాండ్ డాక్యుమెంట్లు దోచుకుపోయారని తెలిపారు. దీనిపై బాధితులు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆరిలోవ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి 24 గంటల్లో దొంగను పట్టుకున్నట్లు తెలిపారు. మల్కాపురం ప్రాంతం గొల్లవీధికి చెందిన నూనెల కృష్ణ ఈ దొంగతనాలు చేసినట్లు చెప్పారు. అతని నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.73,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కృష్ణ పాత నేరస్తుడని, అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 20 కేసులు ఉన్నట్లు తెలిపారు. పలుమార్లు జైలుకు వెళ్లినట్లు వివరించారు. ఈ కేసు ఛేదించిన క్రైం విభాగం అధికారులను ఆమె అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment