ఫిర్యాదులపై లోతైన విశ్లేషణ
● పీజీఆర్‌ఎస్ పెండింగ్ ఫిర్యాదులసమీక్షలో అధికారులతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ● 18 నుంచి 28 వరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు
మహారాణిపేట: ఒకే సమస్యపై ప్రజల నుంచి పదే పదే వచ్చే వినతులపై లోతైన విశ్లేషణ అవసరమని, వాటికి నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వస్తున్న ఫిర్యాదులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. అధికారులకు పలు అంశాలపై అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాతే.. వాటి పరిష్కారం కోసం అధికారుల వద్దకు వస్తారని, అలా వచ్చే వారికి సాంత్వన చేకూర్చేలా అధికారులు నడుచుకోవాలని, వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించి భరోసా కల్పించాలని పేర్కొన్నారు. పదే పదే ప్రజలను కార్యాలయాలు చుట్టూ తిప్పించుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు.
అర్జీదారులతో ఫోన్లో మాట్లాడాలి
ఫిర్యాదు చేసే అర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా ఫోన్ చేసి మాట్లాడాలని, వారి సమస్య పూర్వాపరాలను తెలుసుకుని వాటికి సరైన పరిష్కారం చూపాలని కలెక్టర్ చెప్పారు. సమస్య క్లిష్టమైనది అయితే క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదు రీ–ఓపెన్ కావడానికి వీల్లేదన్నారు. అలా జరిగితే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఒక శాఖకు వచ్చిన ఫిర్యాదు మరొక శాఖకు చెందినదైతే చాలా మంది రిఫర్ చేసి ఊరుకుంటున్నారని, అలా కాకుండా అర్జీదారుతో నేరుగా మాట్లాడి సమస్య ఏ శాఖ పరిధిలోదో తెలియజేసి, సహకారం అందించాలని సూచించారు.
18 నుంచి 28 ప్రత్యేక ఆధార్ క్యాంపులు
సమావేశంలో భాగంగా ఈ నెల 18 నుంచి 28 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రణాళికలు చేసుకున్నామని సచివాలయాల కో ఆర్డినేటర్ ఉషారాణి తెలుపగా.. పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అధికారులంతా ఇంటింటా సర్వేలో భాగంగా జియో ట్యాగింగ్ చేయించుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర–2047లో భాగంగా అన్ని విభాగాల అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్లు శేషశైలజ, సీతారామారావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment