
స్టీల్‌ప్లాంట్ ఆవిర్భావ వేడుకలు లేనట్టే?
ఉద్యోగుల్లో అసంతృప్తి నేడు నిరసన
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఆవిర్భావ వేడుకలు ఈ ఏడాది లేనట్టే.! ఉద్యోగులకు ఇచ్చే జవహర్‌లాల్ నెహ్రూ అవార్డుల ప్రదానం కూడా వాయిదా పడింది. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ 1982లో ఏర్పాటైంది. ప్లాంట్ ఏర్పాటై మంగళవారానికి 43 ఏళ్లు పూర్తవుతున్నాయి. గత 42 ఏళ్లుగా ఏటా ఫిబ్రవరి 18న ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీ, ప్రత్యేక నడక, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించేవారు. అదే విధంగా ఉక్కు త్రిష్ణా మైదానంలో ఉద్యోగుల కుటుంబ సభ్యుల సమక్షంలో క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసే అధికారులు, కార్మికులకు జవహర్‌లాల్ నెహ్రూ అవార్డుల ప్రదానం జరిగేది. అయితే 2023–24 సంవత్సరానికి అధికారులకు చెందిన ఏసీఆర్‌లు సిద్ధం కాలేదన్న కారణంతో.. యాజమాన్యం వేడుకలు నిర్వహించడం లేదనే సమాచారంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి, ఉత్పాదకతలు గణనీయంగా పెరగడంతో పాటు మంచి స్థితికి చేరింది. త్వరలో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించే తరుణంలో ఉద్యోగులను ప్రోత్సహించాల్సిన యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్ణయానికి నిరసనగా మంగళవారం ఉదయం కార్మిక సంఘాలు ఉక్కు స్మృత్యంజలి కూడలి వద్ద నిరసన తెలపనున్నట్లు గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు, పోరాట కమిటీ కన్వీనర్ కె.ఎస్.ఎన్.రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment