విజ్ఞాన్ కళాశాలలో విద్యార్థుల కోట్లాట
● యువతరంగం వేడుకలో ఘర్షణ ● ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు
కూర్మన్నపాలెం: విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు రెచ్చిపోయారు. యుద్ధాన్ని తలపించేలా ఒకరినొకరు కొట్టుకుని బీభత్సం సృష్టించారు. ఈ కొట్లాటలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ కె.మల్లేశ్వరరావు అందించిన సమాచారం మేరకు.. కళాశాలలో ఏటా యువతరంగ్ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి, ఆవిష్కరిస్తున్న సమయంలో విద్యార్థులు డ్యాన్సులు చేశారు. ఆ సమయంలో ఒక విద్యార్థికి మరో విద్యార్థి కాలు తగిలింది. ఆ విద్యార్థి క్షమాపణ చెప్పినప్పటికీ శాంతించని కాలు తగిలిన విద్యార్థి ఘర్షణకు దిగాడు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో కళాశాల ఆవరణ అంతా గందరగోళంగా మారిపోయింది. ఈ ఘర్షణలో ఈశ్వర్ అనే తృతీయ సంవత్సరం విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఈశ్వర్ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మల్లేశ్వరావు కేసు నమోదు చేశారు. ఇందుకు బాధ్యులైన బీటెక్ చదువుతున్న సూర్యకిరణ్, జయసూర్య, మరికొంతమంది విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులందరిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేస్తామన్నారు. ప్రస్తుతం కాలేజీలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment