ఎన్నికల కోడ్ ధిక్కరించిన గంటా
● సింహగిరిపై ఆలయ మరమ్మతుపనులను ప్రారంభించిన గంటా ● హాజరవ్వని ఈవో, ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ వైదిక పెద్దలు
సింహాచలం: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ పైకప్పు మరమ్మతు పనులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. వర్షాలు పడినప్పుడు స్వామి ఆలయం పైకప్పు నుంచి వర్షం నీరు లోపలకి చేరుతోంది. దీంతో రూ.4 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేపట్టేందుకు పుణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలిజియస్ ట్రస్ట్ ఇటీవల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎప్పుడు పనులు ప్రారంభించేదీ అధికారులు ప్రకటించలేదు. సింహగిరికి సోమవారం వచ్చిన గంటా శ్రీనివాసరావు సంబంధిత పనులను ప్రారంభించారు. అయితే దేవస్థానం ఈవో, ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ అధికారులు, ప్రముఖ వైదికవర్గం ఎవరూ పాల్గొనలేదు. వారంతా ఎన్నికల కోడ్ ఉండడంతోనే పాల్గొనలేదని తెలుస్తోంది. ఆలయ నిబంధనలు, ఆగమశాస్త్ర పద్ధతులు తెలిసిన ఆలయ వైదిక పెద్దలతో పాటు, ఇంజినీరింగ్ అధికారులు లేకుండా గంటా ఎలా శంకుస్థాపన చేస్తారన్న ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆది నుంచి ఆలయ మరమ్మతు పనులను గంటా తన ఖాతాలో వేసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలకు ఆయన చర్యలు బలాన్ని చేకూర్చాయి.
Comments
Please login to add a commentAdd a comment