బహుళ పంటల విధానంపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: లాభదాయక సాగు విధానాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ యాక్షన్ ప్లాన్‌పై కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతు వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, స్థానిక అవకాశాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యానికి, మిల్లెట్లు, బహుళ పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ దిశగా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంపకం చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రత్యేక గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని, వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సమూహాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతు సేవా కేంద్రాలు, ఇతర మార్గాల ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు అధికారి మోహన్ రావు, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, సాగునీటి పారుదల శాఖ అధికారులు, ఇతర అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment