66 కేసుల్లో 74 మంది అరెస్ట్
● జనవరిలో 106 చోరీ కేసుల నమోదు ● వీటిలో 66 కేసులను ఛేదించిన పోలీసులు ● రూ.92.04 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం ● బాధితులకు సీపీ చేతుల మీదుగా సొత్తు అందజేత
క్రికెట్ బెట్టింగ్‌పై ఫిర్యాదు ఇవ్వండి
క్రికెట్ బెట్టింగ్ కారణంగా మోసపోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ పిలుపునిచ్చారు. నేరుగా పోలీస్‌స్టేషన్‌లో అయినా 7995095799 నెంబర్‌కు అయినా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఎవరు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినా కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కూడా ఈ క్రికెట్ బెట్టింగ్‌పై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఈ బెట్టింగ్ కార్యకలాపాలపై నగర టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు.
విశాఖ సిటీ : నగరంలో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదయ్యాయని, ఇందులో 66 కేసులను ఛేదించి 74 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.92,04,095 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో 310.13 గ్రాముల బంగారం, 536.6 గ్రాముల వెండి, రూ.4,56,495 నగదు, 7 బైక్‌లు, ఒక బస్, ఒక కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లు, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీలు ఉన్నాయని వివరించారు. నగరంలో నేర నియంత్రణకు, అలాగే నిందితులను గుర్తించేందుకు గత జనవరి నెలలో 864 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే నేరాలు జరుగుతున్న తీరుపై 251 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ ద్వారా నిఘా పెట్టామన్నారు. అనంతరం బాధితులకు సొత్తు అందజేశారు.
రౌడీలు జైల్లో ఉండాలి
రౌడీలు, అసాంఘిక శక్తులు నగరంలో కాదు.. జైల్లో ఉండాలని సీపీ తేల్చి చెప్పారు. ఇప్పటికే విశాఖలో ఏడుగురిపై పీడీ యాక్ట్, ఐదుగురిపై పీఐటీ ఎన్‌డీపీఎస్ చట్టం అమలు చేసినట్లు తెలిపారు. ఇంకా చాలా మందిపై ఈ చట్టాలను అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రౌడీలను నగరంలో లేకుండా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బీచ్ రోడ్డుపై ప్రత్యేక శ్రద్ధ
బీచ్ రోడ్డులో కొంత మంది ఆకతాయిలు రేసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు వచ్చినట్లు సీపీ తెలిపారు. నగరంలో పలువురు వాహనదారులు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. నోవోటెల్ హోటల్ డౌన్‌లో జరిగిన లారీ ప్రమాదం విషయంపై సీపీ స్పందిస్తూ.. ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించామని, గతంలో జరిగిన ప్రమాదంలో ఒక ఎస్పీ అధికారి తండ్రి మరణించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై డీసీపీ–1, ఏడీసీపీ ట్రాఫిక్, ఇతర అధికారులు దృష్టి పెట్టారని వెల్లడించారు.
డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించాం
ఇటీవల విశాలాక్షినగర్ ప్రాంతంలో దొరికిన డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించామని సీపీ తెలిపారు. త్వరలో అందరిని అరెస్టు చేస్తామని చెప్పారు. ఒడిశా నుంచి కొంత మంది గంజాయిని విశాఖ మీదుగా రవాణా చేస్తున్నారని, వారిపై నిఘా పెట్టామన్నారు. గోవా, బెంగళూరు నుంచి కొంత మంది సింథటిక్ డ్రగ్స్ నగరానికి తీసుకువస్తున్నట్లు గుర్తించామన్నారు. నగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణాను పూర్తిగా నియంత్రించే విషయంపై దృష్టి పెట్టామన్నారు.
66 కేసుల్లో 74 మంది అరెస్ట్
66 కేసుల్లో 74 మంది అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment