వీసీ పీఠంపై ఐఐటీ ప్రొఫెసర్
ఉద్యోగ ప్రస్థానం
● 1997లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం..
● 1998 నుంచి 2000 డిసెంబర్ వరకు జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు.
● 2000 డిసెంబర్ నుంచి 2002 జూన్ వరకు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విజిటింగ్ ఫ్యాకల్టీగా సేవలందించారు.
● 2002 జూన్ నుంచి 2007 ఏప్రిల్ వరకు అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు.
● అనంతరం సెలవులో ఉండి వివిధ అంశాలపై పరిశోధనలు చేశారు.
● 2011 నుంచి 2019 వరకు ఖరగ్‌పూర్ ఐఐటీలోనే ప్రొఫెసర్‌గా పనిచేశారు.
● 2019 ఆగస్టు నుంచి హెచ్‌ఏజీ స్కేల్‌తో అదే చోట ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
● అలాగే ప్రొఫెసర్ రాజశేఖర్ ఖరగ్‌పూర్ ఐఐటీ డీన్‌గా, జేఈఈ మెయిన్స్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించినప్పుడు చైర్మన్‌గా వ్యవహరించారు.
● స్థానికుడికే దక్కిన అవకాశం
● ఏయూ ఉపకులపతిగా
ఆచార్య రాజశేఖర్ నియామకం
విశాఖ విద్య/సింహాచలం: ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిగా ఆచార్య గంగవంశం పైడి రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ సంయుక్తంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య రాజశేఖర్ ప్రస్తుతం ఖరగ్‌పూర్ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఆచార్య రాజశేఖర్‌ది సింహాచలం. తమ ప్రాంతీయుడు ఏయూ వీసీగా నియామకం కావడం ఎంతో గర్వకారణమని రాజశేఖర్ స్నేహితులు, సన్నిహితులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర్ అడవివరం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నారు. గ్రీన్‌పార్క్ సమీపంలోని సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియడ్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ) పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తి చేసి అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. గణితంలో ఆచార్య రాజశేఖర్ చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
కుటుంబ నేపథ్యం
ప్రొఫెసర్ రాజశేఖర్ తండ్రి బలరామకృష్ణ అడవివరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి సావిత్రి గృహిణి. రాజశేఖర్ సోదరుడు గిరిధర్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. రాజశేఖర్ కుమార్తె కూడా ఖరగ్‌పూర్ ఐఐటీలో విద్యనభ్యసిస్తున్నారు. 2017లో అడవివరంలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో స్థానికులు రాజశేఖర్‌ను ఘనంగా సత్కరించారు. రాజశేఖర్ ఏయూ వీసీగా నియామకం కావడంతో అతని స్నేహితులు పాశర్ల ప్రసాద్, టి.వి.కృష్ణంరాజు, రాజనాల సత్యారావు, వై.డి.వి ప్రసాద్, గ్రామస్తులు కర్రి అప్పలస్వామి, కొలుసు ఈశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
వీసీ రిలీవ్
ఏయూ ఇన్‌చార్జి వీసీ బాధ్యతల నుంచి ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం రిలీవ్ అయ్యారు. వర్సిటీకి నూతన వీసీని నియమించిన ప్రభుత్వం.. ప్రస్తుత వీసీ వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు శశిభూషణరావు వీసీ బాధ్యతల నుంచి వైదొలగి.. తన మాతృస్థానమైన ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వెళ్లారు. ఇదిలా ఉండగా ఆచార్య శశిభూషణరావుకు ఏయూ పూర్తిస్థాయి వీసీగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. మరో పక్క వీసీ పోస్ట్ కోసమని ప్రస్తుత రిజిస్ట్రార్ ఎన్.ధనుంజయరావు, రెక్టార్ కిశోర్‌బాబు తమ స్థాయిలో లాబీయింగ్ చేశారు. కానీ వీరికి అవకాశం దక్కలేదు. వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న వీరిని ఇక్కడ కాకుంటే, రాష్ట్రంలోని ఇతర వర్సిటీలకై నా పరిగణలోకి తీసుకుంటారని అంతా భావించారు. కూటమికి చెందిన కీలక నేతలు వీరి కి అభయం కూడా ఇచ్చారనే ప్రచారం సాగింది. కానీ ప్రభుత్వం నుంచి వీరికి ఆశాభంగం తప్పలేదు.
కాగా.. వీసీగా నియమితులైన రాజశేఖర్ ఎప్పుడు విధుల్లో చేరుతారనేది స్పష్టత లేదు. దీనిపై వర్సిటీ వర్గాలకు కూడా సమాచారం లేనట్లుగా తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రార్ ధనుంజయరావు పూర్తి స్థాయిలో వర్సిటీ కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇద్దరు ఆచార్యులకు
వీసీలుగా అవకాశం
ఆంధ్ర యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఆచార్యులను రాష్ట్రంలోని వేర్వేరు వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా ప్రభుత్వం నియమించింది. వర్సిటీ విద్యా విభాగంలో పనిచేస్తున్న ఆచార్య కూన రాంజీని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా యూనివర్సిటీకి, ఇంగ్లిష్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రసన్నశ్రీను రాజమండ్రిలోని నన్నయ యూనివర్సిటీకి వీసీలుగా నియమించింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచే ఇద్దరు ఆచార్యులకు వీసీలుగా అవకాశం దక్కడం విశేషం.
వీసీ పీఠంపై ఐఐటీ ప్రొఫెసర్
వీసీ పీఠంపై ఐఐటీ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment