శివరాత్రి ఆదాయం రూ.కోటి
300 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ
డాబాగార్డెన్స్/కూర్మన్నపాలెం: మహా శివరాత్రి పురస్కరించుకుని వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా ఆర్టీసీకి రూ.కోటి వరకు ఆదాయం సమకూరిందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని శివాలయాలకు సర్వీసులు నడిపినట్లు చెప్పారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అంతకుముందు గాజువాక డిపో నుంచి అప్పికొండ, ఆర్‌కే బీచ్‌కు ప్రత్యేక బస్సులు ప్రారంభించారు. శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే భక్తుల కోసం 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27 సాయంత్రం వరకు నగరంలోని అన్ని డిపోల నుంచి బస్సులు నడిపినట్లు చెప్పారు. గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి ప్రాంతాల నుంచి అప్పికొండకు, అలాగే తగరపువలస, భీమిలి, ఆరిలోవ కాలనీ, రవీంద్రనగర్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక, కూర్మన్నపాలెం తదితర ప్రాంతాల నుంచి ఆర్‌కే బీచ్‌కు సూపర్‌వైజర్లు, సిబ్బంది పర్యవేక్షణలో సుమారు 300 ప్రత్యేక బస్సులను నడిపినట్టు అప్పలనాయుడు వివరించారు. భక్తుల సౌకర్యార్థం ముఖ్య కూడళ్ల వద్ద టెంట్లు వేసి.. ఒక్కో చోట నలుగురు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. మంచి నీరు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. ఒక్క అప్పికొండ తీర్థయాత్ర వల్ల ఆర్టీసీకి రూ.30 లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు ఆదాయం లభించినట్లు వెల్లడించారు. పుణ్యగిరి, నర్సీపట్నం, కల్యాణపులోవ తదితర పుణ్యక్షేత్రాలకు కూడా నగరంలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు పంపించామన్నారు. డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సత్యనారాయణ, సింహాచలం డిపో మేనేజర్ కె.రాజశేఖర్, వాల్తేర్ డిపో మేనేజర్ కె.సుధాకర్, స్టీల్ సిటీ డిపో మేనేజర్ గౌతమ్ చటర్జీ, గాజువాక డిపో మేనేజర్ వి.ప్రవీణ, పర్సనల్ ఆఫీసర్ జె.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment