‘వినదగునెవ్వరు చెప్పిన..’ పుస్తకావిష్కరణ
మధురవాడ: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు రచించిన వినదగునెవ్వరు చెప్పిన పుస్తకాన్ని గాయిత్రి విద్యాపరిషత్ కార్యదర్శి ఆచార్య సోమరాజు ఆదివారం సాయంత్రం మధురవాడ గాయత్రి విద్యాపరిషత్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచన వేదికపై ఆవిష్కరించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం కోసం ఆయన 116 సంచికలుగా రచించిన పుస్తకాన్ని విజయవాడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎమెస్కో సంస్థ ముద్రించింది. ప్రథమ ప్రతిని అష్టలక్ష్మి దేవాలయం ధర్మకర్త అన్నంరాజు సత్యనారాయణ కొనుగోలు చేశారు. కంచి కామకోటి 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా స్వామి మొదలు మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, దేవుల పల్లి కృష్ణశాస్త్రి, రవీంధ్రనాథ్ ఠాగూరు వంటి మహామహులు చెప్పిన పిల్లలకు ఉపయోగపడే అంశాలకు వారు వ్యాఖ్యానాలు చేస్తూ రచించారు. కార్యక్రమంలో ఎమెస్కో ప్రచురణ సంస్థ అధినేత విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment