
మోగిద్దాం!
చీకటి గంట
ఎర్త్ అవర్‌కు పిలుపునిచ్చిన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా నేటి రాత్రి 8.30 నుంచి గంట పాటు లైట్లు ఆర్పాలని పిలుపు విశాఖ సర్కిల్ పరిధిలో ఆ గంట సేపట్లో 5 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా వాతావరణ మార్పు జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఏటా ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నిర్వహిస్తున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవవైవిధ్య ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో భూమిని పరిరక్షించేందుకు ఏటా నిర్వహిస్తున్న కార్యక్రమమే ఎర్త్ అవర్. విద్యుత్ ఆదా చెయ్యడం అంటే.. పర్యావరణాన్ని కాపాడడమే. అందుకే ప్రతీ సంవత్సరం ఒక గంట కరెంటు సరఫరా ఆపేసి.. ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. శనివారం ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అనే సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశాఖలోనూ ఈ బృహత్తర ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు.
భూమిపై ఉన్న ప్రేమ, వాతావరణాన్ని కాపాడటంలో బాధ్యతగా మొదలైన ఒక చిన్న కార్యక్రమమే.. కాలక్రమంలో పెద్ద ఉద్యమంగా మారింది. అదే ఎర్త్ అవర్. ప్రతి సంవత్సరం ఒక రోజున ఒక గంట పాటు నగరంలో మొత్తం విద్యుత్ వాడకాన్ని ఆపేసి ఈ ఎర్త్ అవర్‌ను పాటిస్తుంటారు. ఈసారి మార్చి 22న అంటే.. ఇవాళ రాత్రి సరిగ్గా 8.30 నుంచి 9:30 గంటల వరకు ఈ ఎర్త్ అవర్‌ను పాటించి.. పర్యావరణ పరిరక్షణకు మేము సైతం ముందుకు రావాలంటూ పర్యావరణ వేత్తలు పిలుపునిస్తున్నారు.
ఆ ఒక్క గంటలో 5 లక్షల యూనిట్లు ఆదా
భారత్ ఈ ఎర్త్ అవర్‌లో 2011 నుంచి పాలుపంచుకుంటోంది. ప్రతి ఏటా ఆయా నగరాలు, ప్రాంతాలు గంట పాటు చీకటిగంటని కొట్టి భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించేందుకు నడుంబిగిస్తున్నాయి. విశాఖలోనూ ప్రతి ఇల్లూ ఈ ఎర్త్ అవర్ పాటిస్తే.. లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చెయ్యవచ్చు. సాధారణంగా ఈపీడీసీఎల్ పరిధిలో విశాఖ సర్కిల్‌లో ప్రతి రోజూ 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అంటే.. గంట సేపు విద్యుత్ దీపాలు సర్కిల్ పరిధిలో ఆపేస్తే.. ఏకంగా 5 లక్షల యూనిట్లు ఆదా చెయ్యడంతో పాటు.. 0.82 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు కూడా నియంత్రించవచ్చు. ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఈపీడీసీఎల్ అధికారులు సైతం పిలుపునిస్తున్నారు.
అసలు ఎందుకు లైట్లు ఆర్పాలంటే..?
వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమ అసలు లక్ష్యం. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ కార్యక్రమంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమాన్ని పాటిస్తూ.. ప్రపంచ ఉద్యమంగా మారింది. ఈ క్రమంలోనే.. విశాఖపట్నంలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ (డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పర్యావరణ ఉద్యమాన్ని ప్రతి సంవత్సరం మూడో శనివారం పాటిస్తుంటారు.
రూ.25 లక్షల విలువైన విద్యుత్ ఆదా
పర్యావరణ పరిరక్షణ కోసం సంవత్సరానికి ఒకసారి నిర్వహించే కార్యక్రమమే ఈ ‘ఎర్త్ అవర్’. ఇందులో ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడూ భాగస్వామి కావాలి. భూగోళాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా నగరాల్లో ప్రధాన ప్రదేశాలలో ఒక గంట విద్యుత్తు స్వచ్ఛంధం ఆపేస్తారు. అదేవిధంగా ఇళ్లల్లో విద్యుత్ ఉపకరణాలు ఆపివేయడం ద్వారా కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చు. తద్వారా విద్యుత్తును ఆదా చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించే విధంగా ఉపయోగపడుతుంది. విద్యుత్తు ఆదా సమస్త జీవరాసులనీ కాపాడేందుకు, మన తరాన్నీ, భవిష్యత్తు తరాలను కాపాడేందుకు ఉపకరిస్తుంది. గంటపాటు విద్యుత్ ఆపితే సర్కిల్ పరిధిలో రూ.25 లక్షల విలువైన విద్యుత్‌ను ఆదా చెయ్యగలం.
– శ్యామ్‌బాబు, ఈపీడీసీఎల్ విశాఖసర్కిల్ ఎస్‌ఈ
ప్రతి ఒక్కరూ ఎర్త్ అవర్ పాటించండి
పెరుగుతున్న పర్యావరణ సమస్యలు, రోజువారీ విద్యుత్ వినియోగం యొక్క ప్రభావం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా ఎర్త్ అవర్ అనే గ్లోబల్ గ్రాస్‌రూట్ ఉద్యమం నిర్వహిస్తున్నాం. వ్యక్తులు, సంస్థలు, కమ్యూనిటీలు.. భూ పరిరక్షణతో పాటు వ్యక్తిగత జీవనశైలిలో మార్పు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసమే.. గంట సేపు అనవసరమైన లైట్లను ఆఫ్ చేయాలని పిలుపునిస్తున్నాం. కేవలం విశాఖ నగరంలోనే కాకుండా.. జిల్లా అంతటా పాటించాలని వైజాగ్ ప్రోగ్రాం అధికారి హనీసెలజ్ సహకారంతో అవగాహన కల్పించాం. ప్రతి ఒక్కరూ ఎర్త్ అవర్ పాటించాలని వేడుకుంటున్నాం.
– ఫరీదా టాంపల్,
డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ఇండియా స్టేట్ డైరెక్టర్

మోగిద్దాం!

మోగిద్దాం!