నాలుగో లైన్‌కి మోక్షం | - | Sakshi
Sakshi News home page

నాలుగో లైన్‌కి మోక్షం

Apr 1 2025 10:21 AM | Updated on Apr 1 2025 1:18 PM

నాలుగో లైన్‌కి మోక్షం

నాలుగో లైన్‌కి మోక్షం

● కొత్తవలస–విజయనగరం మధ్య కొత్త రైల్వే లైన్‌ ● రూ.239.91 కోట్లతో టెండర్లు ఆహ్వానించిన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ● రెండేళ్లలో పూర్తి చేసేలా నిబంధనలు ● లైన్‌ పూర్తయితే సరకు రవాణా మరింత వేగవంతం

సాక్షి, విశాఖపట్నం: ఐదేళ్ల క్రితం నాటి ప్రతిపాదనలు ఎట్టకేలకు పట్టాలెక్కుతున్నాయి. తూర్పు కోస్తా రైల్వే ప్రాజెక్టులపై సీతకన్ను వేసిన రైల్వే బోర్డు.. జోన్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత కీలక ప్రాజెక్టులపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా సరకు రవాణాతో పాటు.. రైల్వే ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేలా కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్‌కు మోక్షం కలిసింది. ఈ లైన్‌ నిర్మాణానికి రూ.239 కోట్లతో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు ఖరారు చేసిన తర్వాత... రెండేళ్లలో పనులు పూర్తి కానున్నాయి.

వాల్తేరు పరిధిలో ఉన్న కొత్తవలస, విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్‌ని నిర్మించాలని అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ని కూడా సిద్ధం చేసి నాలుగేళ్ల క్రితం పంపించగా.. దానికి ఆమోదముద్రవేశారు. కాని.. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాథమికంగా నిధులు మంజూరుకు పరిపాలన పరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి. కానీ.. టెండర్లు పిలవడంలో మాత్రం ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి.. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన తర్వాత.. ఒక్కో ప్రాజెక్టుపై రైల్వే బోర్డు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కొత్తవలస–విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్‌కు తాజాగా టెండర్లు ఆహ్వానించారు.

రూ.239 కోట్లతో నిర్మాణానికి..

కొత్తవలస విజయనగరం మధ్య రైల్వేలైన్‌లు కీలకంగా మారాయి. విశాఖపై వచ్చే రద్దీని నియంంత్రించేందుకు కొత్తవలస జంక్షన్‌ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇందుకనుగుణంగా.. విజయనగరం, కొత్త వలస జంక్షన్‌ మధ్య ఫోర్త్‌లైన్‌ అవశ్యమని గుర్తించారు. టూ పాకెట్‌ సిస్టమ్‌తో టెండర్లు ఆహ్వానించారు. దాదాపు 35 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ రాబోతోంది. మొత్తం రూ.239.91 కోట్లతో టెండర్లు పిలిచారు. ఏప్రిల్‌ 25 వ తేదీ వరకూ టెండర్లు వేసేందుకు గడువు విధించారు. మొత్తం 4 షెడ్యూల్స్‌లో పనులు నిర్వహించనున్నారు. వర్క్‌ ఆర్డర్‌ ఖరారు చేసిన తర్వాత... 24 నెలల్లో పనులు పూర్తి చెయ్యాలని నిబంధన విధించారు.

ఈ లైన్‌ పూర్తి చేస్తే వైజాగ్‌రైల్వే స్టేషన్‌కు రైళ్ల రద్దీ నిర్వహణ సులభతరమవుతుంది. అదేవిధంగా.. వైజాగ్‌ పోర్టుతో పాటు స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రధాన పరిశ్రమలకు సరకు రవాణా మరింత సులభతరమవుతుంది. పాసింజర్‌ రైళ్లపై ప్రభావం పడకుండా.. గూడ్స్‌ రైళ్లకు మార్గం సుగమమవుతుందని వాల్తేరు రైల్వే డివిజన్‌ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement