విజయనగరం అర్బన్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రానికే ఎంతో ప్రతిష్టాత్మకమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మే 3వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా జరిగే ఎయిర్‌ఫోర్టు శంకుస్థాపనా కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
విమానాశ్రయ శంకుస్థాపన, ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు అధికార యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షించారు. ముందుగా కలెక్టర్ నాగలక్ష్మి వివిధ శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలీప్యాడ్, భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లతో పాటు పటిష్ట బందోబస్తు నిర్వహించా లని సూచించారు. సభకు అధికసంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని, రాకపోకలకు ఇబ్బందు లు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన జిల్లాలో ఆరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుందన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు, ఎస్పీ దీపిక, జేసీ మయూర్ అశోక్, డీఆర్వో ఎం.గణపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment