కొత్తవలస: మండల కేంద్రంలోని వసంత్ విహార్ కాలనీ సమీపంలో గల జీఎస్‌ఎన్ రాజునగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబసభ్యులు, సీఐ వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని కొయ్యూరు మండలం, ముదునూరు గ్రామానికి చెందిన కె.రాజేష్‌చౌదరి వేపాడ మండలం సోంపురం సమీపంలో క్వారీని లీజ్‌కు తీసుకుని నడుపుతున్నాడు. భార్య పద్మజ, నాలుగు సంవత్సరాల కూతురు జస్వితాచౌదరి, తల్లిదండ్రులతో కలిసి జీఎస్‌ఎన్ రాజు నగర్‌లో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం రాజేష్ చౌదరి బ్యాంకు పని నిమిత్తం విశాఖలోని ఎన్‌ఏడీ కొత్తరోడ్డు వెళ్లగా అపార్ట్‌మెంట్‌లోని పై అంతస్తులో తెలిసిన వారింటికి రాజేష్ చౌదరి తల్లిదండ్రులు, కూతురు వెళ్లారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
అదే సమయంలో రాజేష్ చౌదరి భార్య పద్మజ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగేళ్ల కూతురు వచ్చి ఎంతసేపు తలుపు తట్టినా తీయకపోవడంతో పై అంతస్తులో ఉన్న నాన్నమ్మ, తాతయ్యల దగ్గరకు ఏడ్చుకుంటూ వెళ్లి చెప్పింది. దీంతో వారు వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కోడలు పద్మజ కనిపించడంతో హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ వి.చంద్రశేఖర్, ఎస్సై బొడ్డు దేవిలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
విజయనగరం నుంచి వచ్చిన క్లూస్‌టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలను, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ‘నాకు బతకాలని లేదు. ఎంత ఆలోచించినా ప్రయోజనం లేకపోవడంతో చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. చిట్టితల్లీ జాగ్రత్త, గాడ్‌బ్లస్‌యూ’ అంటూ రాసిన సూసైడ్ లెటర్‌ను మృతదేహం పక్కన లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment