
అదే ధిక్కార ధోరణి
టీడీపీ రెబల్ గొంప కృష్ణ
శృంగవరపుకోట: ప్రజలే నా దేవుళ్లు.. వారే నన్ను నాయకుడిని చేశారు... వారు ఆదేశిస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తా... అంటూ తెలుగుదేశం పార్టీ రెబల్ నాయకుడు గొంప కృష్ణ వెల్లడించారు. ఆకుల డిపో ప్రాంగణంలో ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీపై మరోసారి ధిక్కార ధోరణి ప్రదర్శించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారిని మార్చి తనకు టిక్కెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్చి 24న బల నిరూపణ ర్యాలీ చేసిన కృష్ణ ఆదివారం మరోసారి తన ధిక్కార స్వరం గట్టిగానే వినిపించారు.
తన రాజకీయాలు దండుకోడానికి కాదని, ప్రజలకు సేవ చేయడానికేనని చెప్పారు. చంద్రబాబు చెబితేనే రెండేళ్లు కష్టపడి పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చానని, ఇప్పుడు టిక్కెట్ విషయంలో అన్యాయం చేశారన్నారు. ప్రజలు కోరితే పోటీకి సిద్ధమంటూ తేల్చి చెప్పారు. కార్యకర్తలతో కలసి దేవీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు గొరపల్లి రాము, గొంప వెంకటరావు, రాయవరపు చంద్రశేఖర్, రెడ్డి పైడిబాబు, లగుడు రవికుమార్, ఇప్పాక త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment