టీడీపీ అగచాట్లు!
టీచర్ల ఓట్ల కోసం...
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
శాసనమండలిలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే అది పూర్తిగా వారికి సంబంధించిన వ్యవహారం. తమ సమస్యలపై పెద్దల సభలో గళం వినిపించే వ్యక్తిని ఎన్నుకోవడం ఆనవాయితీ. పార్టీలకు అతీతంగా జరగాల్సిన మేధావి వర్గం ఎన్నికల ప్రక్రియ స్ఫూర్తి కాస్తా టీడీపీ నాయకుల అతి జోక్యంతో పక్కదోవ పడుతోంది. ఏకంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావునే రంగంలోకి దించింది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ మద్దతు ప్రకటించారు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు సార్వత్రిక ఎన్నికలను తలపించేలా విద్యాసంస్థల వెంబడి తిరుగుతున్నారు. ఇదంతా చూస్తున్న టీచర్లు లోలోనే రగిలిపోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన టీడీపీ, జనసేన నాయకులు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనిమిది నెలల పాలన అనుభవమయ్యేసరికి టీడీపీ తత్వం బోధపడింది. ఈ పరిస్థితుల్లో తాము మద్దతు ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు ఆశించిన స్థాయిలో ఓట్లు రావనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలే స్వయంగా తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి దిగుతున్నారు. వారు పనిచేస్తున్నారో లేదో చూడటానికి మళ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ పెద్దలు పరిశీలకులను పెట్టారు. వారుగాక మండల స్థాయిలో టీడీపీ నాయకులకు టీచర్ల ఓట్లు అన్నీ పడేలా చూడాలని హుకుం జారీ చేశారు. తమ ఎనిమిది నెలల పాలనలో విద్యారంగానికి చేసిన మేలు ఏమిటో, టీచర్ల సమస్యలు ఏమి పరిష్కరించారో చెప్పుకోలేక... గత ప్రభుత్వంపైనే ఇంకా నిందలేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ సానుకూల వాతావరణం కనిపించకపోయేసరికి ప్రత్యర్థి ఉపాధ్యాయ సంఘాల్లోని ఓటర్లకూ గాలం వేస్తున్నారు. కనీసం రెండో పాధ్యాన్యత ఓటు అయినా రఘువర్మకు వేయండని బతిమిలాడుకుంటున్నారు. మరోవైపు గతంలో రెండు దఫాల ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాడిన గాదె శ్రీనివాసులనాయుడు పీఆర్‌టీయూ అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. యూటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయగౌరి కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యే ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
● రెండో ఓటే కీలకం...
టీచర్లకు ఏంచేశారు?
సార్వత్రిక ఎన్నికల సమయంలో టీచర్లకు ఇచ్చిన హామీలేవీ ఈ ఎనిమిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు.
పీఆర్‌సీ గురించి కనీసం కమిటీ వేయలేదు. నూతన పీఆర్‌సీ వచ్చేవరకు ఇచ్చే ఐఆర్ అమలు చేయలేదు.
కరువు భృతి బకాయి చెల్లింపులు ఇవ్వలేదు.
ఏపీజీఐ, పీఎఫ్ తదితర రుణాల నిధులు విడుదల చేయలేదు.
ఏళ్లతరబడి నిలిచిపోయిన సరెండర్ లీవ్‌ల ఎన్‌క్యాష్‌మెంట్ చేయట్లేదు.
ప్రధానమైన హామీలలో 117 జీవో రద్దు చేసినట్లే చేసి అదే లక్ష్యంతో ఉన్న ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ విధానం అమలు చేసింది.
విద్యారంగం అభివృద్ధికి దోహదం చేసే తల్లికి వందనం, సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం వంటి విప్లవాత్మకమైన సంస్కరణలను గాల్లో పెట్టేశారు.
గత ప్రభుత్వ విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసేశారు. కొత్తగా డీఎస్సీ ప్రకటించినా ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులుపడట్లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయం తగదు
8 నెలల పాలనపై అసంతృప్తి...
మానవ వనరుల అభివృద్ధికి కీలకమైన విద్యారంగం రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వ ఎనిమిది పాలనలో రోజురోజుకీ దిగజారిపోయింది. పేద, బడుగు వర్గాలను విద్యావంతులను చేయడమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలన్నింటినీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కేసింది. ఈ ధోరణులను ఎండగట్టే మేధావులు చట్టసభలో అడుగుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడా తమకు అనుకూలమైనవారినే గెలిపించుకుంటే ఇక నిరసన గళమే ఉండదనే ఆలోచనలో టీడీపీ నాయకులు పనిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన మద్దతు ఇస్తున్న ఏపీటీఎఫ్ (257) అభ్యర్థి రఘువర్మ తరఫున ప్రచారానికి వస్తున్న వారిని టీచర్లు గట్టిగానే నిలదీస్తున్నారు. గత రెండు రోజుల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు పర్యటించిన ఎస్.కోట, బొబ్బిలి, విజయనగరం ప్రాంతాల్లో చీదరింపులు ఎదురయ్యాయని కూటమి ప్రభుత్వ సానుభూతి టీచర్లే చెప్పుతున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విజయనగరం జిల్లాలో 5,223 మంది ఓటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,333 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పీఆర్‌టీయూ తరఫున బరిలోకి దిగిన గాదె శ్రీనివాసులనాయుడు, యూటీఎఫ్ మద్దతుతో పీడీఎఫ్ తరఫున పోటీచేస్తున్న కోరెడ్ల విజయగౌరి, టీడీపీ కూటమి మద్దతుతో ఏపీటీఎఫ్ తరఫున అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. కానీ టీడీపీ, జనసేన నేతృత్వంలో కూటమి ప్రభుత్వ విధానాల ఫలితంగా రఘువర్మ ఈ పోటీలో వెనుకబడ్డారు. గత ఆరేళ్లలో ఆయన ఏ రోజూ సభలో మాట్లాడలేదని, టీచర్ల సమస్యల గురించి ఆయన పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా గమనించిన టీడీపీ నాయకులు ఇప్పుడు రెండో ఓటు గురించి తాపత్రయపడుతున్నారు. తొలి ప్రాధాన్య ఓటు ఎవరికి వేసినా రెండో ప్రాధాన్య ఓటు అయినా రఘువర్మకు వేయండని టీడీపీ నాయకులు టీచర్లను అభ్యర్థిస్తున్నారు. కానీ ఆ పప్పులేవీ తమ వద్ద ఉడకవని పోటీ సంఘాల టీచర్లు తెగేసి చెబుతున్నారు.
విజయనగరం గంటస్తంభం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో రాజకీయం తగదని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో శనివారం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజ అభివృద్ధికి మార్గదర్శకులని, ఓటు ఎవరికి వేయాలో వారికి తెలుసునని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల నాయకులు వారిని ప్రలోభపెట్టడం, సూచనలు, సలహాలు ఇవ్వడం విచారకరమన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. సమావేశంలో మాతృభూమి సేవా సంఘ కార్యదరర్శి ఇప్పలవలస గోపి, పౌరవేదిక ప్రతినిధి తుమ్మగంటి రామమోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా జరగాల్సిన
ఎన్నికల్లో రచ్చ
ఉపాధ్యాయులను ప్రభావితం చేసేలా సమావేశాలు
నియోజకవర్గాలవారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు
మండలాలవారీగా టీడీపీ నాయకుల మోహరింపు
టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యంపై టీచర్ల గుర్రు
రెండో ప్రాధాన్య ఓటు కోసం ప్రత్యర్థి
సంఘాలవారికీ టీడీపీ వల
వర్మకు ససేమిరా వేయబోమంటున్న పోటీ వర్గాలు
ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల
నిలదీస్తున్న టీచర్లు
టీడీపీ అగచాట్లు!
Comments
Please login to add a commentAdd a comment