ఏసీబీ అధికారినంటూ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌..! | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ అధికారినంటూ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌..!

Published Sun, Feb 23 2025 1:07 AM | Last Updated on Sun, Feb 23 2025 1:07 AM

-

నెల్లిమర్ల రూరల్‌: తన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని, వీఆర్‌ఓ గోవింద డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల నెల్లిమర్ల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చనమల్లుపేటకు చెందిన రైతు అబద్ధం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. రైతు ఆరోపణపై విచారణ చేపట్టాలని ఇప్పటికే కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఘటనను ఆసరాగా తీసుకున్న గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి సదరు వీఆర్‌ఓ గోవిందకు శనివారం బెదిరింపు కాల్స్‌ చేశాడు. తాను ఏసీబీ కార్యాలయం నుంచి డీఎస్పీని మాట్లాడుతున్నానని, రైతు ఆత్మహత్యా ప్రయత్నం ఘటనపై ఆదివారం సాయంత్రంలోగా అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించాడు. పెళ్లి అయ్యిందా.. పిల్లలున్నారా... వంటి ప్రశ్నలతో హడలెత్తించాడు. రైతు శశనివారం కూడా పాయిజన్‌ తాగేందుకు ప్రయత్నించాడని వీఆర్‌ఓకు చెప్పి భయపెట్టాడు. వీఆర్‌ఓ భార్యతో కూడా మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పాడు. పాపకు ఆరోగ్యం బాగోలేదని చెప్పిన తరువాత, భయపడాల్సిన అవసరం లేదని సీఐ ఇంటికి వచ్చి కోర్టులో ప్రవేశపెడతారని చెప్పాడు. చివరిగా.. ఎవరికీ విషయం చెప్పొద్దని, ఈ అంశంలో తహసీల్దార్‌ను బుక్‌ చేద్దామని, నిన్ను తప్పిస్తా రూ.2లక్షలు ఇవ్వగలవా? అని డబ్బులు డిమాండ్‌ చేశాడు. తాను అప్పుల్లో ఉన్నానని, డబ్బులు ఇవ్వలేనని వీఆర్‌ఓ చెప్పగా.. సరే ఏదో చేద్దామంటూ కట్‌ చేశాడు. కొద్దిసేపటి తరువాత ఈఓపీఆర్‌డీ శంకర్‌ జగన్నాధంకు కూడా అదే వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించాడు. తహసీల్దార్‌, ఎంపీడీఓల ఫోన్‌ నంబర్లు ఇవ్వాలని అడిగాడు. కార్యాలయ అడ్రస్‌ వివరాలు చెబితే అక్కడికి వచ్చి చెబుతానని ఈఓపీఆర్‌డీ బదులివ్వగా సదరు నకిలీ అధికారి కాల్‌ కట్‌ చేశాడు. కాగా ఇద్దరికీ 81054 28257 ఫోన్‌ నంబరు నుంచే కాల్‌ వచ్చింది. కాగా ఏసీబీ నకిలీ డీఎస్పీ ఫోన్‌ కాల్స్‌తో అధికార వర్గాల్లో చర్చ సాగింది.

రైతు ఆత్మహత్యా యత్నం పేరిట బ్లాక్‌మెయిల్‌

రూ.2లక్షలు ఇవ్వాలని వీఆర్‌ఓకు డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement