కందిపప్పు కట్..!
విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్ లబ్ధిదారుల ‘పప్పు’లుడకవిక. పేదలకు సరఫరా చేసే కందిపప్పు సరఫరాకు ఎసరు పెట్టింది. కేవలం బియ్యం, పంచదార సరఫరాకే ప్రజాపంపిణీ వ్యవస్థను పరిమితం చేసింది. ఎన్నికలవేళ అలవికాని హామీలిచ్చిన కూటమి నేతలు గద్దె నెక్కాక ఒక్కొక్కదానిని తుంగలో తొక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పేరిట రూ.15 వేలు చొప్పున అందిస్తామని చెప్పారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా ఆర్థిక సాయం సున్నాగానే మిగిలింది. రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా పేరుమార్చి రైతులకు ఏమార్చారు. పైసా సాయం అందజేయకుండా కష్టాల్లోకి నెట్టారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉత్తుత్తిదే అని తేల్చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒక్కరికీ ఇచ్చిన దాఖాలా లేవు. నిరుద్యోగ భృతి ఎండమావిగానే మారింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని సరుకులు ప్రజలకు అందిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించే సరుకుల్లోనూ కోత విధిస్తూవస్తున్నారు. గత కొద్ది నెలలుగా కందిపప్పులో కోత విధిస్తున్న కూటమి సర్కారు మార్చి నెలకు ఏకంగా మంగళం పాడేయడంపై మండిపడుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని పాలన ఎందుకంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అమరావతిని కట్టేస్తే పేదల కడుపునిండుతుందా అని ప్రశ్నిస్తున్నారు. పెద్దల లబ్ధికోసం పేదలకు కేటాయించాల్సిన డబ్బులన్నీ రాజధాని నిర్మాణం పేరుతో జేబుల్లోవేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో తెలుపు రేషన్‌కార్డు దారులు 5,71,354 మంది ఉన్నారు. వీరికి నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలు జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.180 పలుకుతున్న కందిపప్పును కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి గతంలో వలే కిలో రూ.67 చొప్పున రాయితీపై అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
రేషన్ లబ్ధిదారులకు నిలిచిన కందిపప్పు సరఫరా
కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ
మార్చినెలకు విడుదలకాని కందిపప్పు
జిల్లాలో రైస్‌కార్డులు 5,71,354
571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం
లబ్ధిదారులకు బియ్యం, పంచదార మాత్రమే సరఫరా
సరఫరా కాలేదు..
రేషన్ కార్డుదారులకు మార్చినెలకు సరఫరా చేసేందుకు కందిపప్పు సరఫరా కాలేదు. జిల్లాకు నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం పడుతుంది. ఈ నెల బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తాం.
– కె.మధుసూదనరావు,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
కందిపప్పు కట్..!
కందిపప్పు కట్..!
Comments
Please login to add a commentAdd a comment