లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు

Published Tue, Mar 4 2025 1:42 AM | Last Updated on Tue, Mar 4 2025 1:41 AM

లింగ

లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు

విజయనగరం ఫోర్‌్ట: లింగ నిర్ధారణ చేసేవారితో పాటు, సంబంధిత అంశంపై వాణిజ్య ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జీవనరాణి హెచ్చరించారు. జిల్లా వైద్యశాఖ పరిధిలో నమోదైన ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. సీసీపీఎన్‌డీటీ యాక్టును అతిక్రమిస్తే మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా తప్పదన్నారు.

వ్యవసాయ పద్ధతులపై అవగాహన అవసరం

ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎంవీవీ శ్రీనివాస్‌

విజయనగరం ఫోర్ట్‌: వ్యవసాయ పద్ధతులను విద్యార్థులు తెలుసుకోవాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎంవీవీ శ్రీనివాస్‌ తెలిపారు. ఏరువాక కేంద్రంలో సోమవారం గ్రామీణ వ్యవసాయ అవగాహన అనుభవ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొంతున్న నైరా కళాశాల వ్యవసాయ విద్యార్థులతో సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి రైతులు వివిధ పంటల్లో అవలంభిస్తున్న పద్ధతులను తెలుసుకోవాలన్నారు. వారికి తెలియని విషయాలను తెలియజేయాలన్నారు.

సీనియార్టీ జాబితాపై

అభ్యంతరాల స్వీకరణ

ఈ నెల 10వ తేదీలోపు గడువు

డీఈఓ యు.మాణిక్యంనాయుడు

విజయనగరం అర్బన్‌: పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కింద పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయ/ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్‌) రూపొందించిన ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుని పూర్తి పేరు, పనిచేస్తున్న కేడర్‌, అభ్యంతరం చెబుతున్న వివరాలు వివరించాలి. సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి. ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు విధిగా జతచేయాలి. పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాయంలో సంప్రదించవచ్చని తెలియజేశారు.

రోడ్డు పనులకు సహకరించండి

అటవీశాఖ అధికారులకు ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సూచన

విజయనగరం అర్బన్‌: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చిన్నకోనల గిరిశిఖర గ్రామ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు సహకరించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు కోరారు. రోడ్డు పనులను అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారంటూ గిరిజనుల నిరసన తెలపడంపై ఆయన సోమవారం స్పందించారు. నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలోని రొంపల్లి పంచాయతీ పరిధి కొండశిఖర గ్రామాలైన చిన్నకోనల, భూరిగా, వనిజతో పాటు ఎన్‌.ఆర్‌.పురం పంచాయతీ పరిధిలోని మరో ఐదు గ్రామాలను కలుపుతూ వేసే రోడ్డు నిర్మాణంపై అటవీశాఖ అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేయాలని సంబంధిత అధికారులను కోరారు. గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనపై అలసత్వం వహించరాదన్నారు.

బొబ్బిలిలో నిలిచిన గూడ్స్‌రైలు

బొబ్బిలి: సాంకేతిక సమస్య కారణంగా బొబ్బిలి–డొంకినవలస రైల్వేస్టేషన్‌ల మధ్య ఓ గూడ్స్‌రైలు సోమవారం సాయంత్రం నిలిచిపోయింది. దీంతో బొబ్బిలి రైల్వేస్టేషన్‌ మీదుగా ప్రయాణించాల్సిన విశాఖ–కొరాపుట్‌ రైలుతో పాటు పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంట కాలం పాటు రైలు అలాగే ఉండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. స్పందించిన రైల్వే అధికారులు.. కొరాపుట్‌ రైలుకు వేరే ఇంజిన్‌ తెప్పించి, ఆ రైలును కదిలించే ప్రయత్నం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు 1
1/2

లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు

లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు 2
2/2

లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement