పైడితల్లీ పాహిమాం..!
రాజాం/రాజాం సిటీ: ఉత్తరాంధ్రుల ముత్తైదువుగా పేరొందని రాజాం పోలిపల్లి పైడితల్లి జాతర మంగళవారం వైభవంగా సాగింది. చివరి రోజు వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. కొండంపేటకు చెందిన లంకలపల్లి కుటుంబీకులు ఘటాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడంతో జాతర ముగిసింది. తొలిరోజు నుంచే వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పసుపుకుంకుమలు సమర్పించి కోళ్లు, చీరలు చూపించి మొక్కుబడులు చెల్లించారు. జాతరకు వచ్చే భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, దాతలు సేవలందించారు. తాగునీరు, మజ్జిగ, పులిహోర ప్రసాదాలను అందజేశారు. జాతర సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం సీఐలు అశోక్‌కుమార్, ఉపేంద్ర, ఎస్‌ఐ జనార్దనరావు తమ సిబ్బందితో కలిసి గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. దేవదాయశాఖ ఈఓ మాధవరావుతో పాటు ఉన్నతాధికారులు, ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
అట్టహాసంగా పోలిపల్లి పైడితల్లి జాతర
చివరిరోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులు
భక్తుల సేవలో తరించిన స్వచ్ఛంద, వ్యాపార సంస్థలు
పైడితల్లీ పాహిమాం..!
Comments
Please login to add a commentAdd a comment