విజయనగరం టౌన్: ఈస్ట్‌కోస్ట్ రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో ఉద్యోగులు, యూనియన్ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజనల్ కోఆర్డినేటర్ పీవీ.మౌళీశ్వరరావు మాట్లాడుతూ పెరిగిన ట్రాఫిక్ కారణంగా అన్ని ఎల్‌సీ గేట్లకు 8 గంటల రోస్టర్‌ను అమలుచేయాలన్నారు. ట్రాక్ మెయింటైనర్లకు సైకిల్ అలవెన్స్‌చెల్లింపును నిర్ధారించాలని, రన్‌ఓవర్ కేసుల్లో స్టేషన్ మాస్టర్లకు మెమోలు ఇచ్చే ట్రాక్ మెయింటైనర్లను నివారించాలని బదులుగా సీయూజీ ఫోన్‌ల ద్వారా సంబంధిత కీమాన్, ట్రాక్ మాన్‌ల నుంచి వివరాలను పొందడంపై పీడబ్ల్యూవే సూపర్ వైజర్‌ల ద్వారా మెమోలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీని పెంచేందుకు క్వార్టర్స్ మెరుగైన నిర్వహణ చేపట్టాలని కోరారు. సేఫ్టీ కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రిస్క్, హార్ట్‌షిప్ అలవెన్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రామిక్ కాంగ్రెస్ విజయనగరం బ్రాంచ్ కార్యదర్శి బి.సత్యనారాయణ, శ్రీకాకుళం బ్రాంచ్ కార్యదర్శి ఎస్.దంతేశ్వరరావు, సెంట్రల్ ఆఫీస్ బేరర్ ఎం.అనిల్ కుమార్, బి.శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.