విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ విద్యలో మెటలర్జికల్ కోర్సులో ప్రతిభచూపిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్‌చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి అన్నారు. జేఎన్‌టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వైజాగ్ చాప్టర్ సంయుక్త నిర్వహణలో సోమవారం నిర్వహించిన 10వ నేషనల్ స్థాయి టెక్నికల్ సింపోజియం ‘ఈఐఎస్‌ఈఎన్ 2కే25’ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోపాటు పరిశోధనా దృక్పథాన్ని విద్యార్థిదశ నుంచే అలవర్చుకోవాలని సూచించారు. సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ కె.భానుశంకరరావు మాట్లాడుతూ మెటలర్జికల్ విద్యలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల ప్రాధాన్యత కీలకమని, దానిపై ఆసక్తిని పెంచుకొని ప్రతిభావంతులు కావాలని సూచించారు. అనంతరం ముఖ్యవక్తను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, మెటలర్జికల్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ జి.స్వామినాయుడు మాట్లాడారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, ఆర్‌ఐఎంఎల్ అండ్ ఐఐఎం వైజాగ్ చాప్టర్ తాతారావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూ జీవీ ఇన్‌చార్జి
వీసీ రాజేశ్వరరావు