బాడంగి: విజయనగరం జిల్లా బాడంగి గ్రామానికి చెందిన వంగపండు అభిషేక్ అనే యువకుడు పోటీ పరీక్షలో ప్రతిభ చూపాడు. కేంద్ర స్థాయిలో ఇటీవల జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్షలో 390కు 354 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 640వ ర్యాంక్ సాధించాడు. సెంట్రల్ జీఎస్టీ అధికారిగా కొలువు సాధించాడు. అభిషేక్ ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్, ఎంటెక్ పూర్తిచేశాడు. తల్లి వెంకటలక్ష్మి హైస్కూల్ టీచర్ కాగా, తండ్రి శ్రీను వ్యాపారి. అభిషేక్‌ను తల్లితండ్రులతో పాటు గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.
భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి
రేగిడి: భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా ల్యాండ్ సర్వే అఽధికారి రమణమూర్తి రైతులకు సూచించారు. మండలంలోని అంబఖండి గ్రామంలో గురువారం రీ సర్వేకు సంబంధించి అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు పొలాల్లోకి వెళ్లి సర్వే చేసిన సమయంలో ఆ భూములకు సంబంధించిన ప్రతి రైతు తప్పనిసరిగా ఉండాలన్నారు. చట్టపరంగా రైతులకు సంబంధించిన భూములకు పూర్తిస్థాయిలో హక్కులు కల్పిస్తామని తెలిపారు. కొన్ని భూములకు ఆధారాలు లేవని, అటువంటి భూములను అధికారులు హక్కులో ఉన్న రైతులకు రికార్డులో పొందుపరిచేలా చూడాలని సర్పంచ్ గోవిందనాయుడు అధికారులను కోరారు. సర్వే చేసిన అనంతరం ప్రతి రైతుకు నోటీస్ ఇస్తామని, అటువంటి వాటిలో ఎటువంటి సవరణలు ఉన్నా సంబంధిత తహసీల్దార్‌కు తెలియజేస్తే వాటిని పునఃసర్వే చేస్తామని రమణమూర్తి స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.చిన్నారావు, రైతులు పాల్గొన్నారు.
ఉగాది వేడుకలకు ఏర్పాట్లు
విజయనగరం అర్బన్: విశ్వావసునామ ఉడాది వేడుకలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. ఉగాది వేడుకల నిర్వహణపై తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచనల మేరకు ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఉగాది పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం, ప్రసాదాల ఏర్పాట్లను దేవదాయశాఖ అధికారులు చేయాలని ఆదేశించారు. సమావేశం అనంతరం ఆడిటోరియంను పరిశీలించారు. సమావేశంలో సమాచార పౌసంబంధాల శాఖ ఏడీ డి.రమేష్, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శాస్త్రి, జిల్లా పర్యాటక శాఖాధికారి కుమారస్వామి, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, తహసీల్దార్ కూర్మనాథ్, ఆయా శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
జీఎస్టీ అధికారిగా బాడంగి కుర్రాడు
జీఎస్టీ అధికారిగా బాడంగి కుర్రాడు