వీరఘట్టం/పాలకొండ రూరల్: మండలంలోని తూడి జంక్షన్ వద్ద సీఎస్పీ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మీసాల తిరుపతిరావు (39) అనే వ్యక్తి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై జి.కళాధర్ సోమవారం తెలిపారు. మృతుని భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బైక్‌పై వస్తున్న తిరుపతిరావును వెనుక నుంచి వస్తు న్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తిరుపతిరావు మృతితో పాలకొండ మండలం పొట్లిలో విషాదఛాయలు అలము కున్నాయి. మృతుడికి భార్యతో పాటు హర్షవర్థన్, సుధీర్ అనే ఇద్దరు కుమారులున్నారు.
పోలీసుల అదుపులో గంజాయి నిందితులు..?
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్‌పోస్టు వద్ద ఫిబ్రవరి 10వ తేదీన ఒడిశా నుంచి తరలిస్తున్న 150 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడగా.. కారు వదిలేసి అందులో ఉన్న నిందితులు పరారైన సంగతి తెలిసిందే. వెంటనే ఈ వ్యవహారంపై సీఐ నారాయణరావు, ఎస్సై వి. ప్రసాదారావు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాపు చేపట్టడంతో నలుగురు నిందితులు దొరికి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అదుపులో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకరు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు గ్రామానికి చెందిన వాడు కాగా.. ఇద్దరు విశాఖ జిల్లా అనందరంపురానికి చెందిన వారని తెలిసింది. అలాగే ఇంకొకరు విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన వ్యక్తి అని సమాచారం. వీరు ఈ గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళుతున్నారు..? అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితులను ఎస్పీ ఎదుట మంగళవారం హాజరుపరచనున్నట్లు సమాచారం.
జోరుగా గ్రావెల్ తవ్వకాలు
భామిని: మండలంలోని బురుజోల – పసుకుడి మెట్ట వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మూడు రోజులుగా తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా జేసీబీలతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తవ్వకాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
రైల్వే ట్రాక్‌పై మృతదేహం
సీతానగరం: మండలంలోని సీతానగరం – గుమ్మిడివరం గ్రామాల మధ్య గల రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే హెచ్‌సీ బి. ఈశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైలు నుంచి జారిపడి మృతి చెందాడా.. లేక రైలు ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగిందా అన్న విషయమై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను బట్టి అతను ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన అరుణ బలేరా (40) సన్నాఫ్ మోహన్ బలేరాగా గుర్తించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి