
రైతుల గోడు పట్టదా..!
సంతకవిటి: నారాయణపురం ఆనకట్టపై కూటమి నేతల నిర్లక్ష్యంపై రైతులు నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఆయకట్టు రైతులు శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ సనపల నారాయణరావు ఆధ్వర్యంలో గురువారం ఆనకట్ట బాట పట్టారు. ఆనకట్ట శిథిలావస్థకు చేరినా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఖరీఫ్ సీజన్‌లో సాగునీరు అందక నాగావళి కుడికాలువ శివారు ఆయకట్టు గ్రామాలైన ఫరీదుపేట, పూడివలస, ఇబ్రహీంబాద్, సనపలవానిపేట, కుశాలపురం, తోటపాలెం, కొత్తపేట, ముద్దాడ, భగీరథీపురం, ధర్మవరం, కొంగరాం, పొన్నాడ, బొంతలకోడూరు తదితర 13 పంచాయతీల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందన్నారు. కనీసం వచ్చే ఖరీఫ్‌కై నా ఆనకట్టతో పాటు కాలువలను అభివృద్ధి చేసి సాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా..
పట్టించుకోని వైనం
నాగావళి నదిపై శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం, విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రంగారాయపురం గ్రామాల మధ్య నారాయణపురం ఆనకట్ట ఉంది. ఆనకట్ట నుంచి 39 కిలోమీటర్ల పొడవున ఉన్న ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఆమదాలవలస మండలంలో 18,691 ఎకరాల ఆయకట్టు, 50 కిలోమీటర్ల పొడవున ఉన్న కుడి ప్రధాన కాలువ ద్వారా సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని 18,362 ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, పొందూరు, ఎచ్చెర్లకు ఇద్దరు ఎమ్మెల్యేలు, విజయనగరం జిల్లాలోని సంతకవిటికి మరో ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నా ఆనకట్టను ఆధునీకరించేవారే కరువయ్యారు. పేరుకే ప్రజాప్రతినిధులు తప్ప రైతుల సాగునీటి కష్టాలను పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం ఒక్కరు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించిన సందర్భం లేదన్నారు. వచ్చే ఖరీఫ్‌నాటికి ఆనకట్టతో పాటు కాలువలను బాగుచేయకుంటే రైతాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు.
తొలగించి... వదిలేసి
ఆనకట్ట నుంచి ప్రధాన కాలువల్లోకి నీటిని మళ్లించే హెడ్ రెగ్యులేటర్ సిస్టంను మార్చేందుకు పాత రెగ్యులేటర్ సిస్టంను, స్కవర్ వెండ్స్‌ను తొలగించి కొత్తవి అమర్చకుండా అలానే విడిచి పెట్టేశారు.
నారాయణపురం ఆనకట్ట
ఆనకట్ట వద్ద రైతుల ఆందోళన
శిథిలావస్థలో ఉన్న ఆనకట్టను
బాగుచేయాలంటూ విజ్ఞప్తి
రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు
ఏటా ఎచ్చెర్ల మండలంలోని 13 గ్రామాల్లో శివారు ఆయకట్టుకు సాగునీరు అందడంలేదు. పొట్ట దశలో పంట ఎండిపోతోంది. రైతులు నష్టపోతున్నారు. కనీసం తిండిగింజలు కూడా పండడం లేదు. ప్రభుత్వం స్పందించాలి. జైకా నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టి రైతులను ఆదుకోవాలి.
– సనపల నారాయణరావు, శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ
పనులు పూర్తి చేస్తాం
హెడ్ రెగ్యులేటర్, స్కవర్ వెండ్స్ పనులు పూర్తిచేసి ఖరీఫ్ నాటికి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూస్తాం. కాలువలు, ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌కు నోటీసులు అందించాం. పనులు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటాం.
– వై.రవీంద్ర నాయుడు,
డీఈ, నారాయణపురం ఆనకట్ట

రైతుల గోడు పట్టదా..!

రైతుల గోడు పట్టదా..!

రైతుల గోడు పట్టదా..!