
గ్రూప్ – 2 ఫలితాల్లో శ్రీనివాస్ సత్తా
విజయనగరం అర్బన్: ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ – 2 మెయిన్ ఫలితాల్లో మండలంలోని సుంకరిపేటకు చెందిన మాజీ వాయుసేనాని సుంకర శ్రీనివాస్ సత్తా చాటారు. 2004 నుంచి 20 సంవత్సరాల పాటు ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మన్‌గా సేవలు అందించి 2024 జనవరిలో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ.. గత నెలలో విడుదలైన ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పోటీ పరీక్షలో జీఎస్‌టీ అండ్ కస్టమ్స్ శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. అయితే గ్రూప్ – 2 ఫలితాల్లో విజేతగా నిలవడంతో ఈ పోస్టులోనే జాయిన్ అవుతానని శ్రీనివాస్ తెలిపాడు.
యువకుడి అదృశ్యం
పార్వతీపురం రూరల్: మండలంలోని డోకిశీల గ్రామానికి చెందిన చింతల కిశోర్ అనే యువకుడు ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై బి. సంతోషికుమారి తెలిపారు. ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కిశోర్‌ను మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఆటో బోల్తా
● పది మందికి గాయాలు
బొబ్బిలి రూరల్: మండలంలోని ముత్తాయివలస గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తలకు గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పక్కి గ్రామంలో ఒకరు మృతి చెందగా.. కొండదేవుపల్లి గ్రామానికి చెందిన బంధువులు పరామర్శకు ఆటోలో బయలుదేరారు. సరిగ్గా కమ్మవలస వద్దకు వచ్చేసరికి ఆటో బోల్తా పడడంతో అందులో ఉన్న పదిమందికీ గాయాలయ్యాయి. వెంటనే వీరిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించగా.. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. వీరిలో బి.పారినాయుడు, లక్ష్మున్నాయుడు తలలకు గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే బేబినాయన, డీఎస్పీ భవ్యారెడ్డి, తదితరులు పరామర్సించారు.
మద్యం సీసాల పట్టివేత
బొండపల్లి: మండలంలోని గరుడుబిల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిలో 65 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై యు. మహేష్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శనివారం గ్రామంలో తనిఖీలు చేపడుతుండగా.. మహేష్ ఇంటిలో మద్యం బాటిళ్లు దొరికాయి. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో సిబ్బంది తాళ్లపూడి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
పశువుల శాల కూలి ఆవు మృతి
వీరఘట్టం: మండలంలోని దశుమంతపురం గ్రామంలో పశువుల శాల కూలి ఆవు మృతి చెందింది. శుక్రవారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి కెంగువ గణేష్‌కు చెందిన పశువుల శాల కూలిపోయింది. ఆ సమయంలో శాలలో రెండు ఆవులు, రెండు దూడలుండగా.. ఒక ఆవు, రెండు దూడలు తప్పించుకున్నాయి. ఒక ఆవు మాత్రం మృతి చెందింది. విషయం తెలుసుకున్న వీఆర్‌ఓ రాజేంద్ర శనివారం గ్రామానికి చేరుకుని పశువుల శాల, ఆవు కళేబరాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని చెప్పారు. బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
పిడుగుపాటుకు మరో ఆవు..
కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం పిడుగు పడడంతో పి. సత్యనారాయణకు చెందిన ఆవు మృతి చెందింది. ఇంటి సమీపంలోని కళ్లంలో ఆవును కట్టగా.. ఒక్కసారిగా పిడుగు పడడంతో తమ జీవనాధారమైన ఆవు మృతి చెందిందని సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

గ్రూప్ – 2 ఫలితాల్లో శ్రీనివాస్ సత్తా

గ్రూప్ – 2 ఫలితాల్లో శ్రీనివాస్ సత్తా

గ్రూప్ – 2 ఫలితాల్లో శ్రీనివాస్ సత్తా

గ్రూప్ – 2 ఫలితాల్లో శ్రీనివాస్ సత్తా