
ట్రాన్స్‌ఫార్మర్లను ఎత్తుకెళ్లిపోతున్నారు..
కొత్తవలస: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. దేశపాత్రునిపాలెం గ్రామ సమీపంలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం రాత్రి ఎత్తుకెళ్లిపోయారు. గడిచిన రెండు నెలల వ్యవధిలో మండలంలోని పలు గ్రామాలలో ఏడు ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయని ఏఈ అప్పారావు తెలిపారు. కంటకాపల్లి జగనన్న కాలనీలో –2, కాటకాపల్లి జగనన్న కాలనీలో –1, పెదరావుపల్లిలో –2, దాట్ల లే అవుట్‌లో రెండు ట్రాన్స్‌ఫార్మర్లను ఎత్తుకెళ్లిపోయారని చెప్పారు. సింగిల్ ఫేజ్ (16 కేవీ సామర్థ్యం) ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ సరఫరా ఉన్నప్పుడే దొంగలు చాకచక్యంగా కిందకు దించి అందులో గల కాపర్‌ను తీసుకొని ట్రాన్స్‌ఫార్మర్ డొక్కులను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ విలువ రూ. 2 లక్షలకు పైనే ఉంటుంది. దేశపాత్రునిపాలెంలో జరిగిన దొంగతనంపై గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.