
పోలీసుల సాక్షిగా రాములోరి కల్యాణం
● పెనసాంలో భారీగా మోహరించిన పోలీసులు
● ఉత్కంఠ పరిస్థితుల్లో శ్రీరామ నవమి వేడుకలు
గంట్యాడ: మండలంలోని పెనసాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సీతారాముల కల్యాణం జరిగింది. పోలీసుల సాక్షిగా సీతారాములు మరోసారి ఒక్కటయ్యారు. అసలు కల్యాణం జరుగుతుందో.. లేదోననే ఉత్కంఠ శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు నెలకొంది. వివరాల్లోకి వెళితే.. పెనసాం గ్రామంలో 25 ఏళ్లుగా లెంక నారాయణప్పడు కుటుంబీకులు శ్రీరామనవమి రోజున కల్యాణం జరిపిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది కూటమి పార్టీకి చెందిన కొంతమంది ఎప్పడూ ఒకే కుటుంబీకులు కల్యాణం జరిపించాలా... మర్చాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో 15 రోజుల కిందట పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో గంట్యాడ పోలీస్ స్టేషన్, విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఏళ్ల తరబడి తమ కుటుంబ సభ్యులే సీతారాముని కల్యాణం జరిపిస్తున్నామని లెంక నారాయణప్పడు కుటుంబీకులు పోలీసులు, అధికారులకు చెప్పారు. అప్పట్లో గ్రామ పెద్దలు, మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో లెంక నారాయణప్పడు కుటుంబీకులే కల్యాణం జరిపించాలంటూ చేసిన తీర్మానాలను సైతం అధికారులకు చూపించారు. అయినప్పటకీ కూటమి నేతలు అంగీకరించలేదు. విజయనగరం డీఎస్పీ పెనసాం గ్రామ పెద్దలు, మండల ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ, కూటమి కి చెందిన నేతలతో శనివారం రాత్రి కూడా చర్చలు జరిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎట్టకేలకు లెంక నారాయణప్పడు కుటుంబీకుల్లో ఒకరు, కూటమికి చెందిన ఒకరు కల్యాణం జరిపించడానికి అంగీకరించారు. ఇరువర్గాలు అంగీకరించినప్పటకీ, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 120 మంది వరకు ఇతర సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 144వ సెక్షన్ విధించారు. అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా సీతారాముల కల్యాణం జరిగితే.. పెనసాంలో పోలీసుల పహారాలో కల్యాణం జరగడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్యాణంలో జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నరసింహామూర్తి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, సర్పంచ్ కర్రోతు పాపాయ్యమ్మ , ఎంపీటీసీ సభ్యుడు లెంక మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల సాక్షిగా రాములోరి కల్యాణం