
కార్మికులకు అండగా.. ఈ శ్రమ్
అర్హులు వీరే..
● వయసు 16 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
● ఆదాయపు పన్ను పరిధిలోకి రాకూడదు.
● ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) సదుపాయం లేని వారు.
● ఉద్యానవనాలు, నర్సరీలు, పాడి పరిశ్రమ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు, టైలర్లు, డ్రైవర్లు, హెల్పర్లు, వీధి వ్యాపారులు, కల్లుగీత, రిక్షా కార్మికులు, చెత్త ఏరేవారు, కొరియర్ బాయ్‌లు, ఇళ్ల పనివారు, ఉపాధి వేతనదారులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజనం వర్కర్లు, లోడింగ్/అన్‌లోడింగ్ కార్మికులు, తదితరులందరూ ఈ పథకానికి అర్హులు.
● పథకంపై అవగాహన అంతంతమాత్రమే
● జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులు సుమారు 7 లక్షల మంది
● పథకంలో నమోదైన వారు 4,19,542 మంది
● అవగాహన కల్పించని అధికారులు
విజయనగరం గంటస్తంభం: అసంఘటితరంగ కార్మికుల పట్ల విజయనగరం జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యధోరణి అవలంభిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ పథకం గురంచి తెలిసిన వారే నమోదు చేసుకుంటున్నారు తప్ప తెలియని వారి గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో సుమారు 7 లక్షల మంది వరకు అసంఘటిత రంగ కార్మికులుండగా.. ఇంతవరకు 4,19,542 మంది మాత్రమే ఈ పథకంలో నమోదు చేసుకున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 2 లక్షల మంది పైచిలుకు నమోదు చేసుకోవాల్సి ఉంది.
కొరవడిన అవగాహన..
అధికారులు అవగాహన కల్పించకపోవడంతో ఈ పథకం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియడం లేదు. ప్రారంభంలో అధికారుల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కార్మిక సంఘాల నేతల సూచనలతో నమోదు చేసుకునేందుకు కార్మికులు పోటీపడ్డారు. ఇప్పుడు ఎక్కడా ఆ ఊసే లేదు. అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు, చిరు వ్యాపారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఈ – శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో నమోదైన వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. పైగా ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతాయి. ఈ పోర్టల్‌ను ప్రారంభించి ఏడాది గడిచినా.. నేటికీ చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు.
చేకూరే ప్రయోజనాలివి..
ఈ –శ్రమ్‌లో నమోదైతే 12 అంకెలు కలిగిన యూఏఎన్ కార్డులు అందజేస్తారు. ఈ కార్డులు ఉన్నవారికే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ అంగవైకల్యం చెందితే రూ. లక్ష బీమా పరిహారం అందజేస్తారు. అలాగే ఇతర సంక్షేమ పథకాల్లో కూడా వీరికి ప్రాధాన్యం ఇస్తారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి ఉపాధి మార్గాలు చూపిస్తారు. 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తారు.
పథకంలో నమోదుకు కావాల్సిన పత్రాలు..
సేవింగ్ బ్యాంక్ ఖాతా
బ్యాంక్ ఖాతా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్
రేషన్ కార్డు
ఆదాయ ధృవీకరణ పత్రం
ఆధార్ కార్డ్
యాక్టివ్ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో లింక్
నివాస ధృవీకరణ పత్రం
పాస్‌పోర్టు సైజ్ ఫొటో
వయస్సు రుజువు పత్రం
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
ఈ–శ్రమ్ పథకంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు ఆరుగురికి ప్రమాద బీమా పరిహారం రూ. 2 లక్షల చొప్పున అందజేశాం. ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నా ఈ పథకానికి అర్హులే.
– ఎస్‌డీవీ ప్రసాదరావు, కార్మిక శాఖ ఉప కమిషనర్, విజయనగరం జిల్లా

కార్మికులకు అండగా.. ఈ శ్రమ్

కార్మికులకు అండగా.. ఈ శ్రమ్

కార్మికులకు అండగా.. ఈ శ్రమ్

కార్మికులకు అండగా.. ఈ శ్రమ్