
సిబ్బంది అవసరాల కోసం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
విజయనగరం క్రైమ్: పోలీస్‌సిబ్బంది అవసరాలకు అనుగుణంగా కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పని చేస్తోందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వార్షిక సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎస్పీతోపాటు ఏఎస్పీ సౌమ్యలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి అవసరార్థం ఆర్థికపరంగా ఆదుకోవడానికి క్రెడిట్ సొసైటీ ఏర్పాటు జరిగిందన్నారు.తక్కువ వడ్డీకి కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు పొందవచ్చన్నారు. కుటుంబ అవసరాలైన పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాల కోసం సిబ్బంది పే స్కేల్ ఆధారంగా రుణాలు పొందవచ్చని చెప్పారు. కాగా 2024–2025 ఆదాయ వ్యయాల,సంక్షేమానికి సొసైటీ తీసుకున్న, అమలు చేసే చర్యలను సభ్యలకు ఎస్పీ తెలియజేశారు. సిబ్బంది తీసుకున్న సభ్యత్వం,సర్వీస్ ఆధారంగా ఇప్పటికే రూ. మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. వెల్ఫేర్‌లో భాగంగా కో ఆపరేటివ్ సభ్యత్వం కలిగిన టెన్త్, ఇంటర్ చదివిన సిబ్బంది పిల్లలకు రూ.లక్షా,87 వేల 500 స్కాలర్‌షిప్‌లను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పిల్లలు ఎక్కడ చదువుతున్నదీ?ఎంత ర్యాంక్ తెచ్చుకున్నారు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎస్బీ సీఐ చౌదరి, ,ఏఆర్ ఆర్‌ఐ గోపాలనాయుడు కో ఆపరేటివ్ సెక్రటరీ నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు రామకృష్ణ, ఈశ్వరరావు, విజయ్‌చందర్, చిన్నారావులతో పాటు,పోలీస్ అడ్‌హాక్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్
డీపీఓలో కో ఆపరేటివ్ సొసైటీ వార్షిక సమావేశం