
రిటర్నింగ్ అధికారులదే పూర్తి బాధ్యత
వనపర్తి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నామపత్రాల స్వీకరణ నుంచి లెక్కింపు వరకు ఆర్వోలదే కీలక పాత్రని.. ఏ చిన్న పొరపాటుకు తావివ్వొద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఆర్వోలు, ఏఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణనిచ్చారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 17 మంది ఆర్వోలు, ఎంపీటీసీ ఎన్నికలకుగాను 53 మంది ఆర్వోలు, మరో 53 మంది ఏఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేటప్పుడు అన్ని ధ్రువపత్రాలు, వివరాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్లరికల్ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని.. తప్పనిసరిగా అభ్యర్థుల సమక్షంలోనే స్క్రూటినీ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని.. కారణం లేకుండా నామినేషన్లను తిరస్కరించడానికి వీలు లేదన్నారు. నామినేషన్లను తిరస్కరిస్తే తప్పనిసరిగా కారణాలు పేర్కొనాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆర్వోలకు గురువారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని.. సకాలంలో హాజరుకావాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్‌రెడ్డి, ఏఓ భానుప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు

రిటర్నింగ్ అధికారులదే పూర్తి బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment