
అప్‌గ్రేడ్ అందని ద్రాక్షేనా?
దశాబ్దాలుగా గ్రేడ్–3 పురపాలికగా వనపర్తి
వార్షిక ఆదాయం అంచనా రూ.4.77 కోట్లు..
వనపర్తి పట్టణ వార్షిక ఆదాయం రూ.4.77 కోట్లు సమకూరుతుందని అధికారులు లక్ష్యం నిర్దేశించుకొని పనిచేస్తున్నారు. రెండేళ్లుగా.. పట్టణాభివృద్ధి 70 శాతం జనరల్ ఫండ్ నుంచే చేస్తున్నట్లు అధికారుల నివేదికల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ మినహా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో విడుదలయ్యే సీఐఎస్ (పరిసరాల అభివృద్ధి నిధి) నిలిచిపోయింది. పట్టణ ప్రగతి నిధులు సైతం నిలిచిపోవడంతో పురపాలికకు వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పనులు, ఇతర ఖర్చులు చూసుకుంటున్నారు. ఐదేళ్లలో రెండు పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆయా పాలకవర్గాలు అభివృద్ధి పేరుతో నిధులు ఖర్చు చేసే విషయంపై ఉన్న ధ్యాస.. పుర ఆదాయాన్ని పెంచే అంశంపై చూపించలేదనే విమర్శలు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం మున్సిపల్ కాంప్లెక్స్–1 టెండర్లు నిర్వహించి పెరిగిన ధరలకు అనుగుణంగా అద్దెలను పెంచడం.. నిబంధనల ప్రకారం 25 ఏళ్లు దాటితే ప్రభుత్వ అనుబంధ దుకాణ సముదాయాల పాత లీజును రద్దు చేస్తూ కొత్తగా టెండర్ నిర్వహించి మారిన ధరలకు అనుగుణంగా కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు వనపర్తి మున్సిపాలిటీలో అమలు కావడం లేదన్నది బహిరంగ సత్యం.
వనపర్తి: వనపర్తి పుర ప్రజల కల అప్‌గ్రేడ్ దశాబ్దాలుగా అందని ద్రాక్షగానే మిగులుతోంది. 2012లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన గజ్వేల్‌ను సైతం ఇటీవల గ్రేట్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు దస్త్రాలు కదులుతుండగా.. 1984లో ఏర్పడిన వనపర్తి పురపాలికపై నిర్లక్ష్యం అలుముకుంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గద్వాలతో పాటు వనపర్తి మున్సిపాలిటీని సైతం గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేయాలని అప్పటి ప్రభుత్వానికి స్థానిక పాలక, అధికార వర్గం ప్రతిపాదనలు పంపినా.. ఈ పురపాలిక విషయంలో వివక్ష కొనసాగింది. జనాభా, ఆదాయ వనరులు, పట్టణ విస్తీర్ణంలో గద్వాలకు ఏమాత్రం తీసుకొని వనపర్తి నేటికీ గ్రేడ్–3 మున్సిపాలిటీగానే కొనసాగుతుండటం శోచనీయం. తాజాగా కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా, మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా, గజ్వేల్‌లాంటి మున్సిపాలిటీని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేశారు. వనపర్తి విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం స్థానికంగా కొంత నిరుత్సాహం అలుముకుంది. వనపర్తిని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధుల కొంతమేర పెరగుతాయి.
2019 పుర ఎన్నికల సమయంలో..
2019 మున్సిపల్ ఎన్నికల సమయంలో పట్టణానికి సమీపంగా ఉన్న ఆరు గ్రామాలను పంచాయతీరాజ్ నుంచి మున్సిపాలిటీలో విలీనం చేశారు. వార్డులను సైతం 24 నుంచి 33కి పెంచారు. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను, అభివృద్ధి, బెటర్మెంట్ చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ పన్ను తదితర ఆదాయాలు మరింతగా పెరిగాయి. విలీన గ్రామాల్లో రాజనగరం, వడ్డెవాడ, నాగవరం, శ్రీనివాసపురం, మర్రికుంట, మర్రికుంటతండా ఉన్నాయి.
వనపర్తి పట్టణ వ్యూ
లక్షకు పైగా జనాభా.. 62,144 మంది ఓటర్లు..
ప్రస్తుత పట్టణ జనాభా 1.04 లక్షలు ఉండవచ్చని అధికారుల ప్రాథమిక అంచనా. నిత్యం వివిధ అవసరాల నిమిత్తం సమీప గ్రామాల నుంచి 20 వేల నుంచి 30 వేల మంది జిల్లాకేంద్రానికి వచ్చి వెళ్తుంటారు. గత మున్సిపల్ ఎన్నికల సమయానికి పట్టణ ఓటర్ల సంఖ్య 54,992 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 62,144కు పెరిగిందని అధికారిక లెక్క. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలోగా మరో వెయ్యికి పైగా ఓట్లు పెరిగే అవకాశం లేకపోలేదు.
పదేళ్లుగా ఎదురుచూపులు
నిధుల ఖర్చుపైనే పాలకుల మక్కువ ఎక్కువ
ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్‌తోనే పాలన
Comments
Please login to add a commentAdd a comment