నేడు ‘పేట’కు సీఎం రేవంత్
నారాయణపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా శుక్రవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేసింది.
● సీఎం శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో నారాయణపేట మండలంలోని సింగారం చౌరస్తా సమీపంలోని గురుకుల పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.1.23 కోట్లతో నిర్మించిన నూతన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు భూమి పూజ చేస్తారు. 1.35 గంటల నుంచి 2 గంటల వరకు రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్యకళాశాల, హాస్టల్ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల ఫస్టియర్ అకాడమిక్ బ్లాక్‌ల ప్రారంభించనున్నారు. వీటితో పాటు ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్‌స్టేషన్లు, వివిధ గ్రామాల్లో రూ.500కోట్లకుపైగా నిధులతో నిర్మించనున్న రోడ్లు, హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.10గంటలకు బహిరంగసభలో పాల్గొని, మాట్లాడుతారు.
పర్యవేక్షించిన
అధికారుల బృందం
సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ క్రిస్టియానా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీశ్, ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింగారం చౌరస్తాలోని హెలీప్యాడ్ స్థలాన్ని, సమీపంలోని నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని, అప్పక్‌పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగసభ వేదిక పక్కన గ్రీన్ రూమ్, వేదికపై సీటింగ్ కెపాసిటీ, వీఐపీ గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు సైతం ఏర్పాట్లను పరిశీలించారు.
● సీఎం పర్యటనకు 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి ఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 81మంది ఎస్‌ఐలు, 133 మంది ఏఎస్‌ఐలు, 750 కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం పర్యటన ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్–2 ఐజీపీ సత్యనారాయణ, జోగుళాంబ జోన్ –7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ పరిశీలించారు.
రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నేడు ‘పేట’కు సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment