
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
● నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తా
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
ఆత్మకూర్/అమరచింత/మదనాపురం: మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని ప్రజలు తనను గెలిపించారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తానని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆత్మకూర్ మండలం తిప్పడంపల్లి, బాలకిష్టాపూర్‌లో పార్టీ జెండాలను ఆవిష్కరించడంతో పాటు తిప్పడంపల్లిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే అమరచింత ఏడో వార్డులో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, మదనాపురం మండలం గోపన్‌పేటలో బీజేపీ జెండా ఆవిష్కరించి వివిధ పార్టీలకు చెందిన 40 మంది పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రం నిరుపేదలకు పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. అర్హులందరికీ ఇళ్లు ఇప్పిస్తానని, గ్రామాల్లో హైమాస్ట్ వీధిదీపాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి పయనిస్తున్నారని.. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుర కేంద్రాల్లో తాగునీటి ఇబ్బందులు దూరం చేయడానికే కేంద్రం అమృత్ 2.0 పథకం తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. జూరాల జలాశయంలో నీటినిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయని.. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాత్కాలిక మరమ్మతులకు నిధులు అవసరం ఉంటే తనను సంప్రదించాలని సూచించారు. ఆత్మకూర్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, అశోక్‌జీ, అశోక్‌భూపాల్, అనీల్‌గౌడ్, మనోహర్, రాము, ఎల్లన్న, విష్ణురెడ్డి, శ్రీనివాస్, అమరచింతో జరిగిన కార్యక్రమంలో మంగ లావణ్య, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రవికుమార్, పద్మజారెడ్డి, మేర్వ రాజు, భాస్కర్, మరాఠి అశోక్, వెంకటేశ్వర్లు, గోపన్‌పేటలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.