
జాగ్రత్తలతో వడదెబ్బ దూరం
అత్యవసరమైతేనే బయట తిరగాలి
ప్రశ్న: వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– సుధాకర్, గోపాల్‌పేట
డీఎంహెచ్‌ఓ: ప్రస్తుతం జిల్లాలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కళ్లు తిరగడం, శరీరంలో సత్తువకోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లుగా భావించాలి. నిత్యం ఎండలో పని చేసేవారు నీరు ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.
డా. శ్రీనివాసులు
డీఎంహెచ్‌ఓ
● సరిపడా నీరు తాగడంతో పాటు
రక్షణ చర్యలు తీసుకోవాలి
● చిన్నారులు, వృద్ధులు
వడదెబ్బ బారినపడే ప్రమాదం ఎక్కువ
● ‘సాక్షి’ ఫోన్–ఇన్‌లో
డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులు
ప్రశ్న: వడదెబ్బకు ఎలాంటి చికిత్స పొందాలి?
– వినయ్, మదనాపురం
డీఎంహెచ్‌ఓ: శరీరంలో నీరు, లవణాల శాతం ఒక్కసారిగా పడిపోవడంతో వడదెబ్బ సోకుతుంది. ఒక్కసారిగా కుప్పకూలుతారు. అలాంటి వారిని వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాయి. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో పాటు కొబ్బరి బొండాలు, నీరు అందించాల్సి ఉంటుంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
వనపర్తి: మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు సూచించారు. వడదెబ్బ.. వేసవి జాగ్రత్తలు తదితర అంశాలపై శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్–ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా పాటించాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. మానవ శరీరం 37 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు తట్టుకోగలదని.. జిల్లాలో కొన్నిరోజులుగా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణశాఖ ఆరంజ్ జోన్ జాబితాలో జిల్లాను చేర్చిందన్నారు. ఉపాధి, వ్యవసాయ తదితర ఆరుబయట పనులు ఉదయం 6 నుంచి 9:30 వరకు తిరిగి సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు చేయాలని సూచించారు. రసాయనాలతో తయారుచేసిన శీతల పానీయాలు తాగొద్దని, మజ్జిగ, అంబలి, స్వచ్ఛమైన నీరు ఎక్కువగా తాగడంతో వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు వివరించారు. పండ్ల రసాలు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలని.. ఎండకు బయట తిరగాల్సి వస్తే తలకు టోపీగాని, తెల్లని వస్త్రంగాని ధరించాలని సూచించారు. ఎండలో తిరిగినప్పుడు చెమట ఎక్కువగా వచ్చి శరీరంలో నీటిశాతం తగ్గిపోవడంతో పాటు లవణాల శాతం క్షీణిస్తుందని.. కళ్లు తిరగడం, ఒంట్లో సత్తువ తగ్గినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడంతో పాటు ఓఆర్‌ఎస్ పాకెట్లను నీటిలో కలిపిగాని, గ్లాస్ నీటిలో చిటికెడు ఉప్పు, చక్కెర కలిపి తాగాలన్నారు.
పిల్లలు, వృద్దులు బయట తిరగొద్దు..
చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండలో తిరిగితే త్వరగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని.. బయటకు వెళ్లాల్సి వస్తే తలపై వస్త్రం ధరించడంతో పాటు వాటర్ బాటిల్, అంబలి వెంట తీసుకెళ్లాలని సూచించారు. పిల్లలు రెండు నుంచి మూడు లీటర్లు, పెద్దలు మూడు నుంచి ఐదు లీటర్ల నీరు ప్రతిరోజు తప్పక తీసుకోవాలని, వేసవి ముగిసే వరకు మాంసకృత్తులు తక్కువ తీసుకోవడం మంచిదన్నారు. జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని.. 94 వేల పాకెట్లను పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో సిద్ధంగా ఉంచామని చెప్పారు.
ప్రశ్న: ఆరోగ్యశాఖ తరఫున చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తారా?
– సతీష్, అమరచింత
డీఎంహెచ్‌ఓ: ప్రభుత్వం తరఫున చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు లేవు. దాతల సాయంతో బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. ఎండకు తిరిగే ప్రజలు వాటిని ఉపయోగించుకొని ఉపశమనం పొందవచ్చు.
ప్రశ్న: పిల్లలు, వృద్దులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – రమేష్, గోపాల్‌పేట
డీఎంహెచ్‌ఓ: వేసవిలో పిల్లలు, వృద్దులు నిమ్మ, పండ్ల రసాలు, మజ్జిగ, పెరుగులాంటివి తీసుకోవాలి. కూరల్లో వేపుళ్లు తినడం తగ్గించాలి. ఎండలో బయట తిరగరాదు. ఫ్రిజ్ నీటికి బదులు మట్టి కుండలోని నీళ్లు తాగేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రశ్న: రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి?
– రాజు, వీపనగండ్ల
డీఎంహెచ్‌ఓ: మనిషి బరువు ఆధారంగా నీరు తాగాల్సి ఉంటుంది. 50 కిలోల పైబడినవారు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ తీసుకోవాలి. పిల్లలు మూడు లీటర్లకు తగ్గకుండా తాగాలి. దీంతోపాటు పండ్లు, నిమ్మరసం సేవించాలి.
ప్రశ్న: అతిగా చల్లటి నీరు తాగవచ్చా?
– ఆరిఫ్, అమరచింత
డీఎంహెచ్‌ఓ: మట్టి కుండలో చల్లబడిన నీరు తాగడం శ్రేయస్కరం. 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో చాలాసేపు తిరిగి ఇంటికి రాగానే వెంటనే అత్యధిక చల్లగా ఉండే ఫ్రిజ్ నీటిని తాగడం మంచిదికాదు.

జాగ్రత్తలతో వడదెబ్బ దూరం