
అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
వనపర్తిటౌన్: తెలుగు వెలుగుల ఉగాదిని ఆదివారం జిల్లావాసులు ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాలోని అన్ని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, చింతల హనుమాన్, కన్యకాపరమేశ్వరి, వీరబ్రహ్మేంద్రస్వామి, రామాలయం, లక్ష్మీ నర్సింహస్వామి, లక్ష్మీగణపతి తదితర ఆలయాల్లో అర్చకులు ఉదయం ప్రత్యేక పూజలు.. సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. వనపర్తి సంస్థాన ఆస్థాన సిద్ధాంతి ఓరుగంటి నాగరాజుశర్మ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. విశ్వావసు నామ సంవత్సరంలో రాజకీయ కలహాలు, వైరాలు ఎన్ని ఉన్నా.. అభివృద్ధిలో వనపర్తి పురోగమిస్తోందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో పడిపంటలు, పశుసంపదకు కొదవలేదని చెప్పారు. వనపర్తి ఆదాయం అధికంగా, ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ.. గౌరవంలో ఆశాభంగం తప్పదని, అవమానం అధికమతుందన్నారు. తెలుగు పండుగలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రఘునాథాచార్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, నాయకులు వాకిటి శ్రీధర్, బ్రహ్మం, తిరుమల్, లక్ష్మీనారాయణ, యాపర్ల రాంరెడ్డి, గంధం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అంబరాన్నంటిన ఉగాది సంబరాలు