
జూరాల కాల్వలకు నీటి విడుదల
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు మంగళవారం ప్రాజెక్టు అధికారులు సాగునీరు విడుదల చేశారు. కాల్వలకు నీరు వదలకపోతే వరి పంటలు ఎండిపోతాయని ఆయకట్టు రైతులు ఆందోళన చేయడం, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఎట్టకేలకు రెండ్రోజుల పాటు నీటిని వదలడానికి అధికారులు అంగీకరించారు. మంగళవారం నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు తడులు వదలాలని కోరుతున్నారు.
చెరుకు రైతుల ఆందోళన
అమరచింత: బకాయి ఉన్న రూ.6 కోట్లు వెంటనే చెల్లించాలంటూ చెరుకు రైతులు కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్డారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పరిధిలో కోతలు పూర్తయినా ఇప్పటి వరకు బకాయి డబ్బులు చెల్లించడం లేదన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఏజీఎం, డీజీఎంలకు విన్నవించినా ఫలితం లేకపోయిందని వివరించారు. కేన్ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రరావుకు సమస్యను వివరించగా.. ఆయన ఫ్యాక్టరీ డైరెక్టర్ రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసారెడ్డి, చంద్రసేనారెడ్డి, ఆంజనేయలు, నాగేంద్రం, రంగారెడ్డి, షాలిమియా తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
1,015 అడుగులు
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం 1,015 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 7 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 36 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.

జూరాల కాల్వలకు నీటి విడుదల