
పక్కాగా ‘పోషణ పక్షం’ అమలు
కొత్తకోట రూరల్: చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం పోషణ్ అభియానన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని దండుగడ్డకాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై గర్భిణులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం పక్కాగా అమలుచేస్తూ తల్లీబిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని.. ఎప్పటికప్పుడు పిల్లల బరువు, ఎత్తు చూసి తల్లిదండ్రులకు తెలియజేయాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించి హిమోగ్లోబిన్ శాతం మెరుగుపర్చుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి ఆరునెలలు తల్లి పాలు మాత్రమే పట్టించాలని.. అలా ఇవ్వాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా పిల్లలు రోగాల బారిన పడకుండా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలోని రెండోనంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించి స్టాక్ రిజిస్టర్, సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్న బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తర్వాత భగీరథ చౌరస్తాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం తేమ శాతాన్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. తాలు తొలగింపునకు ఫ్యాన్ ఏర్పాటు చేయాలన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
రేషన్ సన్న బియ్యంతో భోజనం..
మండలంలోని ముమ్మళ్లపల్లి ఎస్సీకాలనీలో మంగళవారం కలెక్టర్ పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంజూరైన సీసీ రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం అడ్డాకుల శరమందా, లక్ష్మి ఇళ్లను సందర్శించి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిందా లేదా అని ఆరా తీశారు. వారితో కలిసి ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. 19వ నంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాసులు, సహకారశాఖ సిబ్బంది నరేశ్, వ్యవసాయశాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.