
భూ సేకరణ వేగవంతం చేయాలి
వనపర్తి: సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భూ సేకరణ, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుద్ధారం పెద్ద చెరువు, గణపసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ సేకరణపై ప్రధానంగా చర్చించారు. బుద్ధారం పెద్ద చెరువుకు సంబంధించి 11.57 ఎకరాల భూమికి వారంలో అవార్డ్ పాస్ చేయడంతో పాటు ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. చెరువు లోపల అవసరమైన 205 ఎకరాల భూమికిగాను 109 ఎకరాలకు త్వరలో అవార్డ్ పాస్ చేయాలని, మిగిలిన 96 ఎకరాలకు సర్వే చేయించాలని ఆర్డీఓను ఆదేశించారు. సర్వే అనంతరం గ్రామసభ నిర్వహించాలన్నారు. గణపసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సర్వే పూర్తయిన 18 ఎకరాలు, మరో 388 ఎకరాల స్థలానికి అవార్డ్ పాస్ చేయాలని, ఇరిగేషన్‌శాఖ వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మిగిలిన 197 ఎకరాల సర్వే చేయించాల్సిందిగా సూచించారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతంగా జరగాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్‌శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ డి.కేశవరావు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.