
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి
వనపర్తి రూరల్: దేశంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సీపీఐ పట్టణ కార్యదర్శి రమేష్ అన్నారు. కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద భారతీయ పర్యాటకులు 27 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడంపై సీపీఐ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఉగ్రవాదం నశించాలి.. మత సామరస్యం వెల్లివిరియాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి క్రూరంగా చంపడం పిరికి పంద చర్య అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశంలో నక్సలైట్లను చంపించే పనిపై ఉన్న దృష్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో లేదన్నారు. మా దేహం ముక్కలైనా.. దేశాన్ని ముక్కలు కానీయబోమన్నారు. పార్టీలు ఎన్ని ఉన్నా దేశం శాంతి సామరస్యాన్ని కాపాడటంలో ఏకమవుతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కళావతమ్మ, ఎర్ర కుర్మయ్య, శిరీష, వెంకటమ్మ, జ్యోతి, చిన్నకుర్మయ్య పాల్గొన్నారు.