సాగు లెక్క పక్కా!
నల్లబెల్లి: రైతులు సాగుచేస్తున్న పంటల లెక్క పక్కాగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సర్వే ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు. ఈ మేరకు వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పంట పొలాలను సందర్శిస్తున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా సాగు వివరాలతోపాటు పంటల ఫొటోలు తీసి డిజిటల్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వేను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నట్లు ఏఈఓలు చెబుతున్నారు. మండల, జిల్లా, డివిజన్ వ్యవసాయాధికారులు ఈ సర్వే యాప్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సర్వే సమయంలో ఎదురవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఏఈఓలను అప్రమత్తం చేస్తున్నారు.
జిల్లాలోని 13 మండలాల్లో 58 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. 1,55,585 సర్వే నంబర్లలోని 1,15,301 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కాగా, సర్వే సమయంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ఏఈఓలు ఇప్పటి వరకు 34,786 సర్వే నంబర్లలోని 27,689 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను యాప్‌లో నమోదు చేశారు. ఇంకా 1,20,799 సర్వే నంబర్లలోని 87,612 ఎకరాల విస్తీర్ణంలో పంటలను సర్వే చేయాల్సి ఉంది.
సర్వేతో ప్రయోజనాలు..
సాంకేతిక పరిజ్ఞానం ఉయోగించి చేస్తున్న ఈ సర్వే ఆధారంగా రైతులు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు, పంటల బీమాతోపాటు పంటనష్టాన్ని అంచనా వేయడానికి దోహదపడుతుంది. ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు రైతులు సాగు చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. దిగుబడి ఎంత వస్తుందనే విషయాన్ని అంచనా వేస్తూ ప్రభుత్వం ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతు బీమా, రైతు భరోసా తదితర పథకాలను డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పక్కాగా అమలు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
నమోదు చేయకుంటే ఇబ్బందులే..
డిజిటల్ సర్వేలో రైతులు పంటల వివరాలు నమోదు చేసుకోకుంటే పంట విక్రయాలు, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపరిహారం పొందేందుకు ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఏఈఓలు గ్రామాల్లో సర్వే నంబర్ల ఆధారంగా సర్వే చేపడుతున్నారు. వీరికి రైతులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
సర్వేతో రైతులకు ఉపయోగం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో పక్కగా పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు డిజిటల్ సర్వే కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే నంబర్ల ఆధారంగా ప్రతి క్లస్టర్ పరిధిలో 2 వేల ఎకరాలు రైతుల పంటల వివరాలు నమోదు చేపడుతున్నాం. ఈ సర్వే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. సర్వేకు వచ్చే ఏఈఓలకు రైతులు సహకరించాలి.
– రజిత, ఏఓ, నల్లబెల్లి
జిల్లాలో కొనసాగుతున్న
డిజిటల్ క్రాప్ సర్వే
యాప్‌లో వివరాలు
నమోదు చేస్తున్న ఏఈఓలు
పర్యవేక్షిస్తున్న వ్యవసాయ అధికారులు
డిజిటల్ సర్వే ఇలా..
వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వే నంబర్‌లో ఉండే పంట పొలాన్ని చూసి పంట వివరాలను యాప్‌లో నమోదు చేయడంతోపాటు ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ పంట సాగు చేశారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలు పక్కాగా నమోదు చేయాలి. పంట లేకుంటే నో క్రాప్ అని నమోదు చేయాల్సి ఉంది.
సాగు లెక్క పక్కా!
సాగు లెక్క పక్కా!
Comments
Please login to add a commentAdd a comment