
పరీక్షలకు సన్నద్ధమవ్వాలి
చెన్నారావుపేట: పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్‌తేజ అన్నారు. ఈ మేరకు మండలంలోని ఉప్పరపల్లి హైస్కూల్‌లో మంగళవారం పదో తరగతి విద్యార్థుల నిర్మాణాత్మక మూల్యాంకన రికార్డులను బృందం పరిశీలించింది. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో ప్రతి సబ్టెక్ట్‌కు 20 మార్కుల చొప్పున నమోదును పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని చెప్పారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సన్మానించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పరిశీలన బృందంలో ప్రభాకర్‌రావు, కొండ కృష్ణమూర్తి, నల్లతీగెల యాకయ్య, శ్రీరామ్ సునిత, తదితరులు ఉన్నారు.
ఆలయ అభివృద్ధికి
రూ.లక్ష విరాళం
వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామంలోని శ్రీకంఠమహేశ్వర ఆలయ అభివృద్ధికి ఖుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఇల్లంద గ్రామ గౌడ సంఘం సభ్యులు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో గ్రామపెద్దలు కస్తూరి బాలరాజు ద్వారా ఎమ్మె ల్యే వివేకానంద.. గౌడ సంఘం సభ్యులకు ఈ విరాళం అందచేశారు. కార్యక్రమంలో పోశాల వెంకన్న, సమ్మెట సూరి, సూరి, వేణుకుమార్, యాకయ్య, కవిరాజు, సమ్మయ్య, సాయిలు, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
డీటీఆర్‌లు ప్రారంభం
గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలిలో నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్ద విద్యుత్ సరఫరా సజావుగా సాగడానికి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీఆర్)ను మంగళవారం ఎన్పీడీసీఎల్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీహర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అలాగే గొర్రెకుంట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని కట్టమల్లన్న ఆలయం వద్ద కొత్తగా డీటీఆర్‌ను ఏర్పాటు చేసినట్లు ఏఈ దిలీప్ తెలిపారు.
20 నుంచి కేయూ
దూరవిద్య సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధి కారి పద్మజ మంగళవారం తెలిపారు. ఈనెల 20, 22, 24, 27, మార్చి 1తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.
ఎంఏ జర్నలిజం,హెచ్‌ఆర్‌ఎం పరీక్షలు
కేయూ దూరవిద్య ఎంఏ జర్నలిజం, ఎంఏ హెచ్‌ఆర్‌ఎం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల ఈనెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. 1,958 మంది విద్యార్థులకు 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.
పురాతన కట్టడాలను
కాపాడుకోవాలి
హన్మకొండ కల్చరల్: పురాతన దేవాలయాలు, కట్టడాలను కాపాడుకుంటే చరిత్రకు ఆధారాలుగా నిలుస్తాయని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సౌమ్యమిశ్రా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆమెను ఆలయమర్యాదలతో స్వాగతించారు. స్వామి వారికి బిల్వార్చన, పూజలు చేసిన అనంతరం ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ అధికారులు, డీసీపీ దేవేందర్‌రెడ్డి, హనుమకొండ సీఐ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీభద్రకాళి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment