అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
ఎల్కతుర్తి: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, తల్లిదండ్రుల కల సాకారం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో గల డాక్టర్ పీవీ రంగారావు తెలంగాణ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో బుధవారం రాత్రి విద్యార్థులతో కలిసి పడుకున్న కలెక్టర్ గురువారం ఉదయం విద్యార్థులతో కలిసి వ్యాయామం, యోగా చేశారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల వాతావరణం చాలా బాగుందని కితాబిచ్చారు. విద్యార్థులు చదువుల్లో, క్రీడల్లో ఉన్నతంగా రాణించి పేరు తీసుకువస్తారన్న నమ్మకం ఉందన్నారు. పాఠశాలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. విద్యార్థినుల కోరిక మేరకు పాఠశాలకు మిషన భగీరథ నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వీయ రక్షణ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ఆత్మస్థైర్యం పెంపొందుతుందన్నారు. పాఠశాల, కళాశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
పీవీ విజ్ఞాన కేంద్రం పెండింగ్ పనులను
త్వరితగతిన పూర్తి చేయాలి
దివంగత మాజీ ప్రధానీ పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. వంగరలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆడిటోరియం, మ్యూజియం, గ్రీనరీ, పేయింటింగ్, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, ఆర్ట్ గ్యాలరీలను పరిశీలించారు. ఈ నెలాఖరులోపు పనులను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. అనంతరం విజ్ఞాన కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీను, అడిషినల్ డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, డీఈ ధన్‌రాజ్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీఓ వీరేశం, ఏపీఎం దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.
జవహర్ నవోదయ విద్యాలయం కోసం స్థల పరిశీలన
హనుమకొండ జిల్లాకు సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు 30ఎకరాలు కావాల్సి ఉండగా వంగర గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆమె పరిశీలించారు. వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ పి. ప్రావీణ్య
Comments
Please login to add a commentAdd a comment