అందరూ ఒక్కటయ్యారు!
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో అడ్తిదారులు, కొనుగోలుదారుల గుమస్తాలు, కొంతమంది ఉద్యోగులు ఒక్కటై మిర్చి ధరలు తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తెగుళ్లతో మిర్చి దిగుబడి తగ్గినట్లు వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఉన్న కొద్ది పంటను అమ్ముకునేందుకు వరంగల్ మార్కెట్‌కు తీసుకువస్తే అందరూ ఒక్కటై ధరలు తగ్గిస్తున్నారని, తెచ్చిన సరుకులు తిరిగి తీసుకుపోలేక, కోల్డ్‌స్టోరేజీల్లో పెట్టేస్థాయి లేకపోవడంతో రైతులు కొనుగోలుదారులు చెప్పిన ధరలేక విక్రయిస్తూ ఇంటి ముఖం పడుతున్నారు. కోల్డ్‌స్టోరేజీల్లో పెట్టుకుంటే రూ.2 లక్షల వరకు 6 నెలలపాటు వడ్డీలేని రుణం వస్తుంది కదా అని ప్రశ్నిస్తే.. ఆ పథకంలో డబ్బులు మంజూరయ్యేవరకూ అప్పులిచ్చినవారు ఆగే పరిస్థితి లేకపోవడంతో తెచ్చిన మిర్చి పంటను విక్రయిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో ఈ–నామ్ అమలు చేయడం లేదు. గురువారం సుమారు 35 వేల బస్తాల మిర్చి వచ్చినట్లు మార్కెట్ ఉద్యోగులు తెలిపారు.
ధరల పతనం వెనుక దళారుల హస్తం!
మిర్చి ధరలు రోజురోజు పడిపోతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధరల నిర్ణయంలో దళారుల దందా మూడు పూలు.. ఆరు కాయలుగా సాగుతోంది. సీజన్‌లో మార్కెట్‌కు వచ్చే సరుకు పెరుగుతున్న కొద్ది ధరలు పడిపోవడం వెనుక దళారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో ఉన్న మిర్చి ధరలు క్రమేణా తగ్గడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. 2024 జనవరిలో గరిష్ట ధర క్వింటాలుకు రూ.24,000 ఉండగా.. కనిష్టంగా రూ.14,000కు తగ్గలేదు. ఈ జనవరిలో గరిష్టంగా రూ.16,000, కనిష్టంగా రూ.11,000 ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన రైతు సంఘాల ప్రతినిధులు మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేయించాలని, మిర్చి రైతులకు పంట నష్టం కింద కేంద్రం మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
నాణ్యతపై నజర్ పెట్టని అధికారులు..
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిస్థితి. మార్కెట్ పరిధిలో సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి, ఇద్దరు గ్రేడ్–2 కార్యదర్శులతో కలిపి మొత్తం 110 మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఇద్దరు గ్రేడ్–2 కార్యదర్శులతో కలిసి 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో మార్కెట్‌లో సరుకుల విక్రయాలపై పూర్తిగా అధికారుల నజర్ లేకుండా పోయింది. ఉన్న వారికే అదనంగా బాధ్యతలు అప్పగించడంతో రైతులు తెచ్చిన సరుకుల ధరలు ఎలా నిర్ణయిస్తున్నారన్న విషయాలు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. సరుకులో తేమ ఏమేరకు ఉందన్న వివరాలను కొనుగోలుదారుడికి చెప్పేవారు లేకపోవడంతో దళారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది వచ్చిన మిర్చి బస్తాలు.. ఈ ఏడాది వచ్చిన బస్తాలను పరిశీలిస్తే పెద్ద మొత్తంలో జీరో దందా సాగుతోందని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి మార్కెట్‌లో మిర్చి ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు.
నాలుగేళ్లలో మార్కెట్‌కు వచ్చిన మిర్చి క్వింటాళ్లలో..
అడ్తిదారులు, గుమస్తాలు, కొంతమంది ఉద్యోగుల సిండికేట్
ఏనుమాముల మార్కెట్‌లో మిర్చి రేటు తగ్గిస్తున్నా పట్టించుకోని అధికారులు
తక్కువ ధరకు సరుకు విక్రయించి
నష్టపోతున్న రైతులు
నెల 2020–21 2021–22 2022–23 2023–24 2024–25
డిసెంబర్ 8,604 40,193 7,704 22,422 37,826
జనవరి 20,785 63,732 53,025 1,24,163 91,341
ఫిబ్రవరి 1,64,831 1,35,166 2,49,267 2,68,769 85,042
Comments
Please login to add a commentAdd a comment