
రాజమహేంద్రవరం రూరల్: బైక్‌ను లారీ ఢీకొన్న సంఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా పైడిచింతపాడు గ్రామానికి చెందిన ముంగర జాన్‌బాబు (21) గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.
దివాన్ చెరువులోని ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. గురువారం రాత్రి సమయంలో స్నేహితుని బైక్ తీసుకుని, మరో స్నేహితుడితో కలిసి రాజమహేంద్రవరం వచ్చాడు. తిరిగి వెళ్తుండగా దివాన్‌చెరువు జీరోపాయింట్ వద్ద బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జాన్‌బాబును రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బైక్ వెనుక స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ జాన్‌బాబు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. అతడి చిన్నాన్న నాగరాజు ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై జగన్‌మోహనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.