సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజా సమస్యలపైనే మాట్లాడతాం.. ప్రజల పక్షాన నిలిచి పోరాడతాం.. ప్రశ్నించే పార్టీ మాది.. ప్రజల కోసం పనిచేసేది మేమే అంటూ జనసేన నేతలు రోజూ హడావుడి చేస్తుంటారు. అలాంటి జనసేన జిల్లా ముఖ్యనేత ప్రశ్నిస్తాను.. నిలదీస్తానంటూ పగటిపూట హంగామా చేస్తూ రాత్రిళ్లు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా కిడ్నాప్ యత్నాలు కూడా తన గ్యాంగ్‌తో కలిసి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన నేత, వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు జయప్రకాష్‌నాయుడు (జేపీ) తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా తణుకులో భూ వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిపై దాడి, కిడ్నాప్ యత్నానికి పాల్పడిన ఘటనలో పోలీసులు అతడితో పాటు, 8 మంది అనుచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అలాగే గతంలోనూ అతడిపై పలు కేసులు ఉన్నాయి.
తీవ్ర చర్చనీయాంశంగా..
జిల్లా జనసేన పార్టీలో జయప్రకాష్‌నాయుడు తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీకి సంబంధించి జిల్లాలో ఉన్న ఏకై క జెడ్పీటీసీ (ప్రజాప్రతినిధి) కావడంతో పార్టీలో ప్రాధాన్యత ఉంది. భీమవరం జనసేనలో జయప్రకాష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. అనుచరగణంతో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ ర్యాలీలు చేస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదంతా ఒక కోణం. మరో కోణంలో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం, కొందరు బ్యాంకర్ల సహకారంతో నకిలీ బ్యాంకు ష్యూరిటీలు సృష్టించి పొరుగు రాష్ట్రాలను బురిడీ కొట్టించేలా టెండర్లు వేయడం, తీరా విచారణకు ఆదేశిస్తే కోర్టులకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇలా ఇతడిపై భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో తొమ్మిదికి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా దాడులు, దౌర్జన్యాలు, స్థలవివాదాల కేసులుండటం అతని వ్యవహార శైలికి నిదర్శనం.
కొన్ని నెలల క్రితం తెలంగాణలో మత్స్యశాఖ చేపల పెంపకానికి సంబంధించి టెండర్లు ఆహ్వానించగా పాలకొల్లులో ఓ బ్యాంకుకు సంబంధించి నకిలీ ష్యూరిటీలు సిద్ధం చేసి జయప్రకాష్‌నాయుడు టెండర్లు వేశారు. ఇవి నకిలీ ష్యూరిటీలని తేలడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అలాగే జయప్రకాష్‌నాయుడిపై భీమవరం వన్‌టౌన్, టూటౌన్, పాలకోడేరు, వీరవాసరం పోలీస్‌స్టేషన్లల్లో 9 కేసులకుగాను రెండు కేసులు పూర్తికాగా, మరో ఏడు కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే 2014లో నకిలీ పత్రాలతో భవనం కబ్జాకి యత్నించారనే కేసు, వీరవాసరంలో ప్రభుత్వ భూమి కబ్జాకి యత్నాంచారని మరో కేసు, వీరవాసరంలో ఓ ఇంటి ప్రహరీ గోడ కూల్చి ఇంటి యజమానిపై దాడికి పా ల్పడిన కేసులు ఉన్నాయి. మొత్తంగా జయప్రకాష్‌నాయుడి వ్యవహారం మరోసారి జనసేన శ్రేణుల్లో కలకలం రేపింది.
అరెస్ట్.. రిమాండ్
తణుకు: వ్యక్తిపై దాడి చేసి కిడ్నాప్‌నకు యత్నించిన ఘటనకు సంబంధించి వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడుతోపాటు మరికొందరిపై తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తణుకు పట్టణ సీఐ ముత్యాల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తణుకుకు చెందిన కొలువూరు శ్రీరామరెడ్డికి జెడ్పీటీసీ గుండా జయప్రకాష్‌నాయుడుకి మధ్య గతం నుంచి ఘర్షణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈనెల 27న శ్రీరామరెడ్డి వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న తణుకు పాతవూరుకు చెందిన నడిపూడి వెంకటశ్రీనివాస్‌ను స్థల వివాదంలో జయప్రకాష్‌నాయుడుతోపాటు మరికొందరు దాడి చేసి చంపుతానని బెదిరించారు. శ్రీనివాస్‌ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌నకూ ప్రయత్నించారు. తన వద్ద సెల్‌ఫోన్, పర్సు లాక్కుని భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయప్రకాష్‌నాయుడుతోపాటు సవరపు నాగసుబ్రహ్మణ్యం, మద్దాల సత్యసాయిబాబా, గ్రంధి రత్నకిషోర్, కరీంశెట్టి వీరవెంకట సత్యనారాయణమూర్తి, జవ్వాది మావుళ్లు, కొల్లాటి జయకృష్ణ, జోడ నాగరాజు, దేవా సాయికృష్ణపై కేసు నమోదు చేసి పోలీసులు మంగళవారం కో ర్టులో హాజరుపరిచారు. రెండో అదనపు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ నాగరాజు నిందితులకు వచ్చేనెల 11 వరకు రిమాండ్ విధిస్తూ తీరు చెప్పినట్టు సీఐ సత్యనారాయణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment