సాక్షి ప్రతినిధి, ఏలూరు: పట్టభద్రుల ఎన్నికల బరిలో అధికార పార్టీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల బలంగా నష్టం చేకూరుతుందనే యోచనతో ఓటుకు నోటుకు తెరదీసి ఓటర్లకు డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు 27న జరగనున్న క్రమంలో మంగళవారం సాయంత్రం 4 గంటలతో ఎన్నికల నిబంధనల మేరకు ప్రచార పర్వం ముగిసింది. ప్రచార పర్వం ముగింపుతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. గ్రాడ్యుయేట్ ఓటుకు రూ. వెయ్యి, పోస్టల్ బ్యాలెట్‌కు రూ.2 వేలు పంపిణీ ప్రక్రియకు టీడీపీ నేతలు తెరదీశారు. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రధానంగా ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్ధి దిడ్ల వీరరాఘవులు హోరాహోరీగా ప్రచారం సాగించారు. వీరు కాకుండా స్వతంత్రులుగా బరిలో ఉన్న మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు జీవీ సుందర్ కుమార్, మరికొందరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్ధి ఎమ్మెల్యేల సహకారంతో క్యాంపు కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించారు. కూటమి అభ్యర్ధికి మద్ధతుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు విద్యా సంస్ధల్లో ఓటర్లను కలిసి ఓటు హక్కు అభ్యర్థించారు. పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్నికల ప్రచారం ముగియడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని వైన్‌షాపులు, బారులు 48 గంటలు పాటు మూతపడ్డాయి.
గ్రాడ్యుయేట్‌కు రూ.వెయ్యి, పోస్టల్ బ్యాలెట్‌కు రూ.2 వేలు
ప్రజాప్రతినిధి కనుసన్నల్లో పంపిణీ ప్రక్రియ
ఉమ్మడి జిల్లాలో ముగిసిన ఎన్నికల ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment