నిబంధనలు మీరి కూటమి శిబిరాలు
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లలోపు కూటమి నేతలు శిబిరాలను ఏర్పాటుచేయడం విమర్శలకు తావిచ్చింది. స్థానిక ఎంఎంకేఎన్‌ఎం ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఉండగా ముందుగా కూటమి ఏతలు కల్పనా వారి వీధిలో శిబిరాలను ఏర్పాటుచేశారు. అయితే మంత్రి నిమ్మల రామానాయుడు ఓటేసేందుకు వచ్చి ఇంత దూరంలో శిబిరం ఉంటే ఓటర్లకు ఎలా కనిపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. 100 మీటర్ల లైన్ దాటి పోలింగ్ కేంద్రానికి అతి సమీపంలో టెంట్ వేసి శిబిరం ఏర్పాటుచేశారు. దీనిపై ఫిర్యాదులు అందగా తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్ ఇక్కడకు చేరుకుని శిబిరాన్ని తొలగించారు. నిబంధనలు మీరితే సహించమని హెచ్చరించారు. అభ్యర్థి నంబర్ సూచించే ప్లకార్డులు కూడా వంద మీటర్లలోపు ఉండకూడదని తొలగించారు.
నాన్ లోకల్ ఓటర్‌కి రూ.2,500?
ఓటేసేందుకు బెంగళూరు, హైదరాబాద్, విశాఖ వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లకు నగదు ప్రోత్రాహకాలు అందించినట్టు సమాచారం. దీంతో కొందరు శిబిరాల వద్ద క్యూ కట్టారు. జాబితాలో కొందరి పేర్లు లేవని, మిమ్మల్ని లోకల్ ఓటరుగానే గుర్తిస్తామనడంతో తీవ్ర చర్చ జరిగింది. దూరప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లకు మాత్రమే దారి ఖర్చుల నిమిత్తం రూ.2,500 ఇవ్వాలని నిర్ణయించిన కూటమి నేతలు పేర్ల నమోదులో అలసత్వం ప్రదర్శించినట్లు తెలిసింది. ఉదాహరణకు తమ వార్డు పరిధిలో 15 మంది ఓటర్లు దూర ప్రాంతంలో ఉన్నారని గుర్తించగా వారిలో పది మంది పేర్లు మాత్రమే పార్టీ కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. దీంతో కొద్దిసేపు శిబిరాల చుట్టూ ఓటర్లు తిరిగారు. కొందరు ఓటర్లకు మెయిన్‌రోడ్ లోని మసీదు వద్ద ఉన్న ఓ వ్యాపార సంస్థ వద్ద నగదు అందించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment