పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ నిర్వహణ, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పట్టభద్రులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి కేంద్రం వద్ద పక్కాగా బందోబస్తుతో పాటు రూట్ మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ఎన్నికలకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. భీమవరం డీఎస్పీ ఆర్.జయసూర్య, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు ఆయన వెంట ఉన్నారు.
ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్
వీరవాసరం: జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరంలోని పీఎస్‌ఎం బాలికల హైస్కూల్, వీరవాసరంలోని ఎంఆర్‌కే జెడ్పీహైస్కూల్‌లో పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఓటర్లతో మాట్లాడి ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మూడు డివిజన్‌లలో ఆర్డీఓలు నోడల్ అధికారులుగా ఉన్నారన్నారు. జిల్లాలోని 93 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు భీమవరం కలెక్టరేట్‌కు చేరుకుంటాయని, అక్కడి నుంచి ఏలూరులోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పా టు చేశామన్నారు. మార్చి 3న ఏలూరులో కౌంటింగ్ ఉంటుందన్నారు. అనంతరం భీమవరం కలెక్టరేట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment