భీమవరం(ప్రకాశం చౌక్): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓట్లు 70,052 కాగా పురుషుల ఓట్లు 39,863, మహిళల ఓట్లు 30,187 ఓట్లు ఉన్నాయన్నారు. 93 పోలింగ్ సేష్టన్లు ఏర్పాటు చేశామని, 27న పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. 17 రూట్ ఆఫీసర్లుగా పంచాయతీ సెక్రటరీలు నియమించామన్నారు. 7 సెక్టార్లకు ఏడుగురు గెజిటెడ్ అధికారులను నియమించామని చెప్పారు. బ్యాలెట్స్ పేపర్లు, ఎన్నికల మెటీరియల్స్ జిల్లాలోని మూడు ఆర్డీవో కార్యాలయాలకు ఇప్పటికే చేర్చామని, గురువారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు వరకు 144 సెక్షన్ అమలల్లో ఉంటుందని తెలిపారు.
27న ప్రత్యేక సెలవు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటు హక్కు ఉన్న వారికి ఓటు వినియోగించుకునే వీలుగా ఫిబ్రవరి 27న స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలకు, ఏర్పాట్ల నిమిత్తం 26న కూడా స్థానిక సెలవుగా ప్రకటించామన్నారు.
పాఠశాలలకు సెలవు ప్రకటించాలి
భీమవరం: ఈ నెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించాలని యుటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయరామరాజు, రామభద్రం, గౌరవాధ్యక్షుడు పట్టాభి రామయ్య తదితరులు కలెక్టర్, డీఈవోకు వినతిపత్రం అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment